హైదరాబాద్: సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ఇంట్లో విషాదం చోటుచేసుకున్నది. గుండెపోటుతో ఆయన కుమార్తె గాయత్రి మృతిచెందింది. 38 ఏండ్ల గాయత్రికి గత రాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చేర్చారు. అయితే పరిస్థితి విషయమించడంతో ఆమె చనిపోయారు. దీంతో రాజేంద్ర ప్రసాద్‌ను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. కాగా, రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అలానే గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.
ఓ సందర్భంలో రాజేంద్ర ప్రసాద్ తన కూతురి గురించి మాట్లాడారు. ఆ సమయంలో ఎంతో ఎమోషనల్ అయ్యారు. బేవార్స్ అనే సినిమా ఈవెంట్లో తన కుమార్తె గురించి మాట్లాడుతూ, అమ్మ లేని వారు కూతురిలో వారి అమ్మను చూసుకుంటారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తన పదేళ్ల వయసులోనే తన తల్లి చనిపోయారని, అందుకే తాను కూడా తన కూతురిలో అమ్మను చూసుకున్నానని చెప్పుకొచ్చారు. కూతురు సెంటిమెంట్‌తో వచ్చిన ‘తల్లి తల్లి నా చిట్టి తల్లి’ అనే పాట తనకు ఎంతో ఇష్టమని అన్నారు. ఆ సాంగ్‌ను గాయత్రికి ఎన్నో సార్లు వినిపించినట్లు తెలిపారు.