Raj Kundra | ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేరకు మోసం కేసు (cheating case)లో బాలీవుడ్ స్టార్ నటి శిల్పాశెట్టి (Shilpa Shetty), ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా (Raj Kundra) నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి రాజ్ కుంద్రాను ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం నిన్న విచారించింది. దాదాపు 5 గంటల పాటూ ఆయన్ని విచారించినట్లు తెలిసింది. బ్యాంకు స్టేట్మెంట్ వివరాలు, ఇతర ఖర్చుల వివరాల గురించి ఆరా తీసినట్లు సమాచారం. విచారణ సందర్భంగా రాజ్‌కుంద్రా నుంచి కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం.
సత్యుగ్ గోల్డ్, విహాన్ ఇండస్ట్రీస్, ఎసెన్షియల్ బల్క్ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, బెస్ట్ డీల్, స్టేట్మెంట్ మీడియా.. ఈ ఐదు కంపెనీల్లో దాదాపు రూ.60 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు రాజ్ కుంద్రా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ నిధులను సంబంధిత కంపెనీల్లో పెట్టారా లేదా ఇతర ఖర్చులకు ఉపయోగించారా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు ఏక్తా కపూర్ బాలాజీ టెలిఫిల్మ్స్‌కు రాజ్ కుంద్రా చెల్లింపులు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అందుకు సంబంధించిన వివరాలను అందజేయాలని రాజ్ కుంద్రాను కోరారు. విచారణ సందర్భంగా కొన్ని కీలక ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. దీంతో రాజ్ కుంద్రాకు మరోసారి సమన్లు జారీ అయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
శిల్పా శెట్టి దంపతులు రూ.60 కోట్ల మోసానికి పాల్పడినట్లు ముంబై వ్యాపారవేత్త దీపక్ కొఠారీ ఇటీవలే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన కంపెనీ 2015 నుంచి 2023 వరకు రుణం, పెట్టుబడి రూపంలో రూ.60.4 కోట్లను ఈ దంపతులకు ఇచ్చిందని తెలిపారు. ఈ సొమ్మును వీరు తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించారు. రాజేశ్ ఆర్య అనే వ్యక్తి ద్వారా తాను శిల్పా-రాజ్ దంపతులను కలిసినట్లు పిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో వారు ‘బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే హోమ్ షాపింగ్ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులోని బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రస్తుతం మూతపడింది.
దీపక్ కొఠారీ ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ప్రాథమిక విచారణ నిర్వహించి, మోసం, నమ్మకద్రోహం తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మోసం మొత్తం రూ. 10 కోట్లకు పైగా ఉండటంతో, కేసును జుహు పోలీస్ స్టేషన్ నుంచి ఆర్థిక నేరాల విభాగానికి (EOW) బదిలీ చేశారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది. కేసు విచారణ సమయంలో దేశం విడిచిపోకుండా ఉండేందుకు శిల్పా దంపతులపై ఆర్థిక నేరాల విభాగం (EOW) అధికారులు ఇటీవలే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.
Also Read..
OG Movie | ‘OG’కి ప్రీమియర్లు లేవా?.. పవన్ అభిమానులకు నిరాశ
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమాకు విదేశాలలో ఇంత క్రేజా.. నిమిషాలలోనే టికెట్స్ సోల్డ్ ఔట్