‘అణచివేయబడిన గొంతుల గురించి మాట్లాడటానికి ఓ గొంతు ఉంది. అది అందరికీ వినపడాలి. మనకు నచ్చినా నచ్చకపోయినా వారి మాటలు వినాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్రపంచంలో ఏకపక్షధోరణి పెరిగిపోయి రాబోవు తరాలు సంకుచితంగా తయారవుతాయి. ఓ అభిప్రాయాన్ని, సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లే తీరులో నారాయణమూర్తిగారికున్న నిబద్ధత, నిజాయితీని ఎవరూ ప్రశ్నించలేరు. అది ఆయన సొంతం. ఆ నిబద్ధత నచ్చే ఇక్కడకు వచ్చాను’ అన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్. స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఆర్.నారాయణమూర్తి తెరకెక్కించిన ‘యూనివర్సిటీ(పేపర్‌లీక్)’ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ఈ సినిమాను వీక్షించిన దర్శకుడు త్రివిక్రమ్ పైవిధంగా స్పందించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాలో పేపర్ లీకేజీతో పాటు విద్యాబోధన ఏ మాధ్యమంలో జరగాలి? విద్యార్థులు జాబ్ క్యాలెండర్ కోసం నిరీక్షించడం, లంచాలు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకోవడం వంటి అనేక ఆలోచింపజేసే అంశాలను చర్చించారు. రెండు గంటల పాటు సినిమాను పట్టుసడలకుండా నడిపించారు. ఆర్.నారాయణమూర్తిగారిలా ఏ విషయంలోనూ రాజీలేకుండా బతకడం అందరికీ సాధ్యంకాదు. నావల్ల కూడా కాదు. నేను చాలాసార్లు రాజీపడ్డాను.
అలా బ్రతకడం అంత తేలిక కాదు. అందుకే ఈరోజు ఆయన కోసం ఇక్కడకు వచ్చాను’ అన్నారు. విద్యను ప్రైవేట్ మాఫియా కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి జాతీయం చేయాలనే అంశాన్ని చర్చిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించానని ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. ఆర్.నారాయణమూర్తి, వైస్.కృష్ణేశ్వరరావు, తిరుపతి నాయుడు, విజయ్ కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: గద్దర్, జలదంకి సుధాకర్, వేల్పుల నారాయణ, మోటపలుకుల రమేష్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం, నిర్మాత: ఆర్.నారాయణమూర్తి.