journalists | మంచు కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఇంటి గొడవలు కాస్తా పోలీసు కేసులు, ఘర్షణలకు దారితీశాయి. మంగళవారం జల్పల్లిలోని మోహన్ బాబు (Mohan Babu) ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. ఇక రాత్రి అక్కడికి వెళ్లిన జర్నలిస్టులపై (journalists) మోహన్ బాబు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ దాడిపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనకు దిగారు.
హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ఛాంబర్ ఎదుట జర్నలిస్టులు ఉదయం నుంచి ఆందోళన చేపడుతున్నారు. ఛాంబర్ ముందు బైఠాయించి మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనల్లో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్‌లపై మోహన్‌బాబు దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలని పాత్రికేయులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన ఉన్మాదిలా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యులను ‘మా’ అసోసియేషన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలకు జర్నలిస్టులు భారీగా తరలివచ్చారు. మోహన్‌బాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆయనపై ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
జల్పల్లిలోని మోహన్‌బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. జల్పల్లి నివాసానికి ఆయన తనయుడు మంచు మనోజ్ రాగా.. సిబ్బంది గేట్లు తెరిచేందుకు నిరాకరించారు. తన కూతురును తీసుకువెళ్తానంటూ గేట్లను బద్దలు కొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. విష్ణు తరఫు బౌన్సర్లు మనోజ్‌ను, మీడియాను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మోహన్‌బాబు మనోజ్‌పై చేయి చేసుకున్నారు.
ఆ తర్వాత ఘటనను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై బూతుపురాణం అందుకున్నారు. తుపాకీ బయటకు తీసి చంపేస్తానని హెచ్చరించారు. అలాగే, గొడవపై స్పందించాలని కోరిన టీవీ మీడియా ప్రతినిధి మైక్ లాక్కొని అతనిపైనే దాడి చేశారు. బౌన్సర్ల దౌర్జన్యంతో పలువురు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. దాడిని నిరసిస్తూ పలువురు జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. మోహన్‌బాబుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడి ఘటనపై జర్నలిస్ట్ సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులపై దాడి కేసులో మోహన్‌బాబుపై కేసు నమోదైంది. ఇదిలా ఉండగా.. మోహన్‌బాబు ప్రస్తుతం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలికి గాయం కావడంతో ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.
Also Read..
Mohan Babu | మోహన్‌బాబు స్థిమితంగా లేరు.. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు
Mohan Babu | పోలీసులను సవాల్ చేస్తూ.. హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్
Manchu Vishnu | కుటుంబ వివాదంపై స్పందించిన మంచు విష్ణు