Manchu Vishnu | ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు.. అతడి కుమారుడు మంచు మనోజ్‌ల మధ్య గొడవ జరుగుతున్న విషయం తెలిసిందే. కుటుంబ వివాదం నేపథ్యంలో ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అయితే ఈ విషయంపై తాజాగా మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు స్పందించాడు.
ప్రతి ఇంట్లోనూ సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు పరిష్కారం అవ్వాలని పెద్దలు కోరుకుంటారు. ఈ విషయంలో ఎవరో ఒకరు తగ్గుతారు అనేది ఒక హోప్ ఉంది. ఈ విషయంపై మాట్లాడటానికి చాలా ఎమోషనల్ అవుతున్నాను. మా నాన్న ఏదైనా తప్పు చేసి ఉంటే అది మమ్మల్ని విపరీతంగా ప్రేమించడం. నేను మీడియా మిత్రులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయాన్ని సెన్సేషన్ చేయకండి. ప్రజల్లో మాకు గుర్తింపు ఉంది. ప్రజల్లోకి తీసుకువెళ్లడం కరెక్టే కానీ కొంతమంది వారి లిమిట్స్ దాటి వ్యవహారిస్తున్నారు. దీని వలన మా అమ్మ ఆస్పత్రిలో చేరింది.
ఇంటికి పెద్ద కొడుకుగా నేను చాలా బాధపడుతున్నా. నిన్న జరిగిన ఘర్షణలో మా నాన్నకు కూడా గాయాలు అయ్యాయి. నేను కన్నప్ప పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ కోసం అమెరికాలో ఉన్నప్పుడు ఇంట్లో గొడవ జరుగుతుందని నాకు ఫోన్ వచ్చింది. ఈ విషయం తెలియగానే అన్నీ ఆపుకోని వచ్చేశాను. కుటుంబం ఇంపార్టెంట్. నిన్న మార్నింగ్ ఇక్కడికి వచ్చాను. నేను లేని మూడు నాలుగు రోజుల్లో ఇంత జరిగింది. నిన్న జరిగిన ఘటనలో ఒక రిపోర్టర్‌కు గాయలు అయ్యాయి. ఇది అనుకోకుండా జరిగింది. ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలి అనుకోలేదు దయచేసి మా నాన్నపై దుష్ప్రచారాలు చేయొద్దు అంటూ విష్ణు కోరాడు.