సీనియర్ నిర్మాత కావూరి మహేంద్ర(79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. గుడివాడ తాలూకా దోసపాడులో జన్మించిన కావూరు మహేంద్ర.. ప్రొడక్షన్ కంట్రోలర్‌గా పలు చిత్రాలకు సేవలు అందించారు. తదనంతరం నిర్మాతగా మారి.. గీతా ఆర్ట్స్ పిక్చర్స్, ఏఏ ఆర్ట్స్ సంస్థలను స్థాపించారు. 50కి పైగా చిత్రాలను నిర్మించారు. నిర్మాతగా మహేంద్ర తొలి చిత్రం 1977లో వచ్చిన ‘ప్రేమించి పెళ్లి చేసుకో’.
ఆ తర్వాత ‘ఏది పుణ్యం? ఏది పాపం?’, ‘ఆరని మంటలు’, ‘తోడు దొంగలు’, ‘బందిపోటు రుద్రమ్మ’, ‘తిరుగులేని మొనగాడు’, ‘డాకూరాణి’, ‘ప్రచండ భైరవి’, ‘కనకదుర్గ వ్రత మహత్మ్యం’ తదితర చిత్రాలను నిర్మించారు. ఏఏఆర్ట్స్ సంస్థను స్థాపించి శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ ‘పోలీస్’ సినిమా నిర్మించారు. ఆ తర్వాత శ్రీహరితోనే ‘దేవా’ సినిమా కూడా తీశారు. కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా, కాజల్‌ని హీరోయిన్గా పరిచయం చేస్తూ ‘లక్ష్మీకల్యాణం’ సినిమా కూడా నిర్మించారు. ఆయన మరణం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతిని గురయ్యింది. గురువారం మధ్యాహ్నం గుంటూరులో మహేంద్ర అంత్యక్రియలు జరిగాయి.