Priyanka Chopra : చిత్ర పరిశ్రమలో స్థిరపడిన తర్వాత తమకు నచ్చిన మరో విభాగంలో పేరు తెచ్చుకోవాలనే ఆసక్తి చూపిస్తుంటారు నాయికలు. ఇలా గాయనిగా ప్రయత్నాలు చేసింది బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా. పాటలు రాసి, ఆలపించి ‘ఇన్ మై సిటీ’, ‘ఎగ్జాటిక్’ అనే రెండు సోలో ఆల్బమ్స్ రిలీజ్ చేసింది. అయితే నటిగా తీరిక లేనందువల్ల తన సంగీత ప్రయాణం ముందుకు సాగడం లేదని ఆమె చెబుతున్నది. సంగీతంలో తాను నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందని, ఆ సాధన, అభ్యాసం చేయకుండా ఇకపై ఆల్బమ్స్ రూపొందించకూడదని నిర్ణయించుకున్నట్లు ప్రియాంక చోప్రా వెల్లడించింది.
నాయికగా తను తీరిక లేకుండా ఉండటమూ ఇందుకు మరో కారణమంది. ఆమె మాట్లాడుతూ…‘మనకు ఇష్టమైన కొన్ని పనుల మీద సమయం వెచ్చిస్తుంటాం. వాటి మీద ఆసక్తి ఉన్నా, కొన్నిసార్లు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. సంగీతంలో నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నేర్చుకున్నది సరిపోకే నా ఆల్బమ్స్ ఆశించిన స్పందన తీసుకురాలేకపోయాయి. నటిగా నా సినిమాల మీద దృష్టి సారించాల్సిన ఒత్తిడి ఉంది. అందుకే మ్యూజిక్ ఆల్బమ్స్ నుంచి కొంత విరామం తీసుకుంటున్నా’ అని చెప్పింది. ప్రస్తుతం ప్రియాంక హిందీలో ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌తో పాటు ‘జీలే జరా’ అనే మరో చిత్రంలో నటిస్తున్నది.