Priyanka Chopra| భారతీయ సినీ పరిశ్రమలో స్టార్డమ్కు కొత్త నిర్వచనం చెబుతున్న పేరు ప్రియాంక చోప్రా. గత ఏడేళ్లుగా బాలీవుడ్లో ఒక్క సినిమా కూడా విడుదల కాకపోయినా, ప్రపంచవ్యాప్తంగా తన బ్రాండ్ విలువను నిలబెట్టుకుంటూ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది . తాజాగా విడుదలైన ఫార్చ్యూన్ ఇండియా–ఇంటర్‌బ్రాండ్ ‘మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీస్’ జాబితాలో ప్రియాంక చోప్రా మూడో స్థానంలో నిలిచి మరోసారి తన గ్లోబల్ క్రేజ్‌ను చాటుకుంది.ఈ ప్రతిష్టాత్మక జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ తొలి స్థానాన్ని దక్కించుకోగా, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ రెండో స్థానంలో నిలిచారు. వీరి తర్వాత మూడో స్థానాన్ని దక్కించుకుంది ప్రియాంక చోప్రా. టాప్-3లో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా సెలబ్రిటీగా ప్రత్యేక గుర్తింపు పొందింది.
ప్రియాంక చోప్రా చివరిసారిగా బాలీవుడ్లో నటించిన చిత్రం ‘ది స్కై ఈజ్ పింక్’. ఈ సినిమా 2019లో విడుదలైంది. ఆ తర్వాత ఆమె పూర్తిగా అంతర్జాతీయ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమాన వర్గం, ప్రముఖ బ్రాండ్లతో ఉన్న అనుబంధం, సోషల్ మీడియా ప్రభావం కారణంగా ఆమె బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గలేదని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. జాబితాలో నాలుగో స్థానంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిలవగా, ఐదో స్థానంలో రణ్వీర్ సింగ్, ఆరవ స్థానంలో అక్షయ్ కుమార్, ఏడో స్థానంలో అమితాబ్ బచ్చన్, ఎనిమిదో స్థానంలో సచిన్ టెండూల్కర్, తొమ్మిదో స్థానంలో ఆలియా భట్ చోటు దక్కించుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పదో స్థానంలో నిలిచి టాలీవుడ్ సత్తాను మరోసారి నిరూపించారు.
ఈ ర్యాంకింగ్స్‌ను కేవలం సంపాదన లేదా సోషల్ మీడియా ఫాలోవర్ల ఆధారంగా నిర్ణయించలేదు. సెలబ్రిటీల మార్కెట్ ప్రభావం, ప్రజల్లో ఉన్న నమ్మకం, బ్రాండ్ ఎంగేజ్మెంట్, సామాజిక బాధ్యత, వ్యక్తిగత ఇమేజ్, డిజిటల్ ప్రభావం వంటి అనేక అంశాలను విశ్లేషించి ఈ జాబితాను రూపొందించారు. సెలబ్రిటీ వ్యక్తిత్వాన్ని ఒక ఆర్థిక ఆస్తిగా పరిగణించి ఈ విలువలను అంచనా వేశారు. మిస్ వరల్డ్ 2000 టైటిల్ గెలుచుకున్న తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా, ‘ఐత్రాజ్’, ‘ఫ్యాషన్’, ‘డాన్’, ‘క్రిష్’, ‘మేరీ కోమ్’, ‘బర్ఫీ’, ‘బాజీరావ్ మస్తానీ’ వంటి చిత్రాలతో అగ్ర నటిగా ఎదిగారు. ‘ఫ్యాషన్’ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా అందుకున్నారు. కాగా, ప్రియాంక చోప్రా త్వరలోనే తెలుగు ప్రేక్షకులను కూడా అలరించనున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న మహేష్ బాబు ప్రతిష్టాత్మక అడ్వెంచర్ ప్రాజెక్ట్‌లో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది.