Pawan Kalyan | జనసేన అధినేత, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ఒకప్పుడు “ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చాను” అని ప్రకటించగా, ఇప్పుడు ఆయన్ని ప్రశ్నించడానికీ ముందుండే వ్యక్తిగా నటుడు ప్రకాశ్ రాజ్ నిలిచారు. పవన్ గతంలో కమ్యూనిస్టు భావజాలాన్ని పట్టుకొని, చేగువేరాను ఆదర్శంగా కొనియాడితే… ఇప్పుడు సనాతన ధర్మం విలువలు చెబుతూ ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా మారారు. ఈ మార్పుపై ప్రకాశ్ రాజ్ ఎన్నోసార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
2018లో జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ బీజేపీపై సంధించిన ఆగ్రహ ప్రసంగాన్ని తాజాగా ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. దీనిపై ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందిస్తూ..“ఈ ప్రశ్నలకు సమాధానం ఏది? Just asking…” అంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఆ ప్రసంగంలో పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే… కేంద్రం ఏపీని దగా చేసింది, స్పెషల్ కేటగిరీ స్టేటస్ హామీని నెరవేర్చలేదు, రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు, ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచారు, మా హక్కుల కోసం పోరాటం చేస్తాం అని అన్నారు. “అమరావతి నుంచే ఉద్యమం ప్రారంభించాలి” అనే పిలుపునిచ్చారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా అదే ఎన్డీయే కూటమిలో భాగమై ఉన్నారు. గతంలో ఆ పార్టీని విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారితో కలిసి ఉండడంపై నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. “అప్పుడు ప్రశ్నించినవే ఇప్పుడు సమాధానమయ్యాయా?” అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమవుతున్నాయి. అయితే ప్రకాశ్ రాజ్ షేర్ చేసిన పోస్ట్‌తో పాటు పవన్ కళ్యాణ్ పాత వీడియోలు, ప్రసంగాలు షేర్ చేస్తూ “సిద్ధాంతాల మార్పు ఎప్పుడైంది?” అనే ప్రశ్నలు వేస్తున్నారు పలువురు నెటిజన్లు. ఈ క్రమంలో పవన్ అభిమానులు, బహిరంగంగా ఆయన నిర్ణయాలను సమర్థించడమే కాకుండా, పరిస్థితుల దృష్ట్యా మార్పు అవసరమేనని వాదిస్తున్నారు.
Inn Sawaalon ka Jawaab Mila ??? ఈ ప్రశ్నలకు సమాధానం ఏది…. #justasking https://t.co/EaWaLOF3Rx
— Prakash Raj (@prakashraaj) July 13, 2025