అగ్ర కథానాయకుడు ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘ఫౌజీ’ ఒకటి. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నూతన నటి ఇమాన్వీ కథానాయిక. 400కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో శరవేగంగా జరుగుతున్నది. ప్రభాస్ లేని సన్నివేశాలను దర్శకుడు హను రాఘవపూడి చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే 70శాతం ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్నది. ఇందులో ప్రభాస్ బ్రిటీష్ సైనికుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. బ్రిటీష్ కాలపు కథతో సాగే ఈ పీరియడ్ డ్రామాలో అద్భుతమైన ప్రేమకథ కూడా ఉంటుందనేది ఇన్సైడ్ టాక్. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 14న కానీ, లేక దసరాకు గానీ పానిండియా స్థాయిలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మిథున్ చక్రవర్తి, అనుపమ్‌ఖేర్, జయప్రద, భానుచందర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ శేఖర్, నిర్మాతలు: నవీన్ యర్నేని, వై.రవిశంకర్.