హీరోకు ఇమేజ్ వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడమే కష్టం. ఈ ఇమేజ్ వారి సినిమా ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటుంది. అంచనాలను అందుకుంటే సరే..లేదంటే సినిమా అపజయం పాలవ్వడం ఖాయం. అల్లూరి సీతారామరాజు సినిమా తర్వాత సూపర్ స్టార్ కృష్ణ 14 వరుస ఫ్లాప్ చిత్రాలను చవిచూశాడు. బాహుబలి (Bahubali) తీసుకొచ్చిన స్టార్ డమ్ కూడా ప్రభాస్ (Prabhas)ను ఇలాగే ఇబ్బంది పెడుతోంది. తర్వాతి చిత్రాలు సాహో, రాధే శ్యామ్ (Radheshyam) ప్రేక్షకులను మెప్పించలేదు. ఇటీవలి సినిమా రాధే శ్యామ్ అపజయంపై ప్రభాస్ తాజాగా స్పందించారు.
ప్రభాస్ మాట్లాడుతూ…బాహుబలి లాంటి సినిమాలు చేయడం నాకిష్టమే. అయితే ఎప్పుడూ అలాంటి సినిమాల్లోనే నటిస్తే నటుడిగా నేను కొత్తదనం చూడలేను. విభిన్నమైన సినిమాల్లో నటించాలని నా కోరిక. అవి చిన్న చిత్రాల్లైనా ఫర్లేదు. రాధేశ్యామ్ రిలీజ్ టైమ్ కు కోవిడ్ ఇంకా పూర్తిగా పోలేదు. ఇదొక కారణం అనుకుంటున్నా. నన్ను ప్రేమ కథల్లో చూడటానికి ఇష్టపడి ఉండకపోవచ్చు లేదా స్క్రిప్టులో ఏదైనా లోపం ఉండి ఉండొచ్చు. అని అన్నారు.
గతంతో చూస్తే ప్రభాస్ సినిమాల ఎంపికలో వేగం పెంచారు. ఆయన దాదాపు ప్రస్తుతం దాదాపు అరడజను చిత్రాల్లో నటిస్తున్నారు. వాటిలో ఆదిపురుష్, సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కె, మారుతి దర్శకత్వంలో సినిమా ఉన్నాయి. లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆలస్యమైన ఈ చిత్రాలన్నీ ఏడాదికొకటి చొప్పున తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి.