Prabhas | సూపర్స్టార్డమ్ ఉన్న హీరోలు హారర్ కామెడీ జానర్లో సినిమా చేయడం అరుదు. ‘రాజా సాబ్’ సినిమాతో ప్రభాస్ ఆ ఫీట్ చేస్తున్నారు. ఇది ప్రభాస్ చేస్తున్న ప్రయోగమే అని చెప్పాలి. నిజానికి ఆయన చేస్తున్నారు కాబట్టే, శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్టుగా ‘రాజా సాబ్’ పాన్ఇండియా సినిమా అయ్యింది. దర్శకుడు మారుతి కెరీర్‌కి ఈ సినిమా కీలకం. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారాయన. రీసెంట్గా విడుదల చేసిన సింహాసనంపై కూర్చుకున్న ప్రభాస్ స్టిల్ అభిమానలోకంలో చర్చనీయాంశమైంది.
ఈ సినిమా నుంచే ైస్టెలిష్‌గా ఉన్న మరో లుక్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. దాంతో ఇందులో ప్రభాస్ డ్యూయెల్ రూల్ చేస్తున్నారా? అనే చర్చ నడుస్తున్నది. ఇక ‘రాజా సాబ్’ ప్రోగ్రెస్ విషయానికొస్తే.. షూటింగ్ ఈ నెలాఖరుకు పూర్తవ్వబోతున్నదట. క్రిస్మస్ కానుకగా టీజర్‌ని విడుదల చేసే ప్లాన్‌లో మారుతి ఉన్నారని తెలుస్తున్నది. అలాగే సంక్రాంతి కానుకగా ఓ మాస్ బీట్‌ని కూడా ప్రేక్షకుల ముందుకు తెచ్చే యోచనలో మేకర్స్ ఉన్నారట.
నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌దత్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి ‘రాజా సాబ్’ ఈ ఏడాది చివరి నుంచి సందడి షురూ చేయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది.