అభిమానుల కోసం ఓ వైపు సినిమాలు చేస్తూనే..మరోవైపు పొలిటికల్ ప్లాన్ రెడీ చేసుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేతిలో క్రిష్ డైరెక్షన్లో చేస్తున్న హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu), హరీష్ శంకర్‌తో చేస్తున్న భవదీయుడు భగత్ సింగ్ (Bhavadeeyudu Bhagat Singh), వినోధయ సీతమ్ తెలుగు రీమేక్ (Vinodhaya Sitham remake) చిత్రాలున్నాయి. సముద్రఖని డైరెక్షన్లో ఈ రీమేక్ చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ మరోవైపు ఆంధ్రప్రదేశ్(AP politics)లో తన రాజకీయ ప్రణాళికను కూడా సిద్దం చేసుకున్నారు. పవన్ కల్యాణ్ అక్టోబర్ నుంచి బస్సు యాత్ర కూడా చేపడుతుండగా..యాత్ర కోసం స్కార్పియో వాహనాలు కూడా పార్టీ కార్యాలయానికి చేరుకున్నాయి. అక్టోబర్ 5 (దసరా) నుంచి యాత్ర మొదలుపెట్టి సుమారు 5 నెలల పాటు యాత్ర నిర్వహించేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు ఉండొచ్చని కథనాలు వస్తున్న నేపథ్యంలో..పవన్ కల్యాణ్ ఇక పాలిటిక్స్ పైనే పూర్తిగా ఫోకస్ పెట్టబోతున్నట్టు స్పష్టం అవుతుంది.
అక్టోబర్ అంటే..ఈ మధ్యలో ఇంకా మూడు నెలలే సమయం ఉంది. పవన్‌తో సినిమాలు చేస్తున్న దర్శకులకు టైం తక్కువుందనే చెప్పాలి. రాజకీయ యాత్ర షురూ చేసే కంటే ముందే ఈ సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. అంటే రాబోయే మూడు నెలల కాలంలో బ్రేక్ తీసుకోకుండా పనిచేస్తేనే ఈ చిత్రాలు పూర్తయే అవకాశం ఉంది. పవన్ పొలిటికల్ కమిట్ మెంట్స్ మేరకు ఆయనతో సినిమాలు చేస్తున్న డైరెక్టర్లు కూడా అలర్ట్ అయ్యే టైం వచ్చేసిందంటున్నారు సినీ జనాలు.
ఇప్పటికే హరిహరవీరమల్లు షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు వినోధయ సీతమ్ రీమేక్‌కు కూడా కాల్షీట్లు ఇచ్చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇంకా మిగిలింది హరీష్ శంకర్‌తో చేయబోయే ప్రాజెక్టు షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. మరి హరీష్ శంకర్ కూడా అలర్ట్ అయి ఈ గ్యాప్‌లో సినిమా పూర్తి చేసేస్తాడా..? అన్నది చూడాలి.