P.Susheela | భారతీయ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో దశాబ్దాల పాటు అలరించిన లెజెండరీ గాయని ఎస్. జానకి మరణం సంగీతాభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. జూలై 11న ఆమె కన్నుమూయడంతో సినీ, సంగీత రంగాల ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ గాయని పి. సుశీల జానకమ్మను తలచుకుంటూ మాట్లాడిన భావోద్వేగ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జానకి గురించి మాట్లాడిన పి. సుశీల తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. “ఏం చెప్పాలమ్మా… మద్రాస్‌లో మేం ఇద్దరం రెండు పర్వతాల్లా ఉండేవాళ్లం. జానకి అసాధారణ ప్రతిభ కలిగిన గాయని. ఆమె పాడిన విధానం, పాటల్లో చూపించిన వైవిధ్యం నిజంగా అద్భుతం. ఆమె లాంటి గొంతు మళ్లీ రావడం చాలా కష్టం” అని అన్నారు.
అలాగే జానకి ప్రతిభను గుర్తిస్తూ, తన పేరుతో ఏర్పాటు చేసిన తొలి అవార్డును ఆమెకే అందజేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నా జీవితంలో నేను చేసిన మంచి పనుల్లో అది ఒకటి అంటూ సుశీల భావోద్వేగంగా చెప్పారు. జానకి మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని సుశీల తెలిపారు. తెలియకుండానే పుడతాం… తెలియకుండానే వెళ్లిపోతాం. జానకి మాత్రం ఎలాంటి గొంతునైనా అలవోకగా పలికించగలిగేది. చిన్నపిల్లలా, మగ గొంతుతో, వృద్ధురాలిలా… ఏ భావమైనా ఆమె అద్భుతంగా వ్యక్తపరచేది. ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోవాలో ఆమెకు బాగా తెలుసు. ఆమె పక్కన నేను ఉత్సవ విగ్రహంలా అనిపించేదాన్ని. ఆమె లేని బాధతో కళ్లలో నీళ్లు కూడా రావడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
సుశీల తన ప్రసంగంలో గతంలో ఇద్దరు గాయనుల మధ్య పోటీ ఉందంటూ ప్రచారం చేసిన వారిపైనా పరోక్షంగా స్పందించారు. ఉన్నన్నాళ్లు మా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు చెప్పి మమ్మల్ని బాధపెట్టారు. నా గురించి ఆమెకు, ఆమె గురించి నాకు చెప్పి ఆనందపడ్డారు. ఇప్పుడు వాళ్ల కళ్లు చల్లబడ్డాయా? ఏం సాధించారు? జానకి తన జీవితంలో అన్నీ సాధించింది అని అన్నారు. జానకి మరణాన్ని ప్రస్తావిస్తూ, ఆమెను సరస్వతి దేవి తన దగ్గరకు పిలిచి ఉండొచ్చు. అక్కడ కూడా ఒక సంగీత కచేరీ కోసం ఆమెను ఆహ్వానించి ఉంటుంది. అలాంటి అదృష్టం అందరికీ దక్కదు. జానకమ్మకు మరణం ఉండొచ్చు కానీ ఆమె గానానికి మాత్రం మరణం లేదు. ఆమె గొంతు ఎప్పటికీ సంగీత ప్రపంచంలో మారుమోగుతూనే ఉంటుంది అని సుశీల భావోద్వేగంగా నివాళులర్పించారు.