సినిమాలకు బలమైన విలన్ చాలా అవసరమని స్టార్ డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli) ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. ఛత్రపతి, సై, మగధీర లాంటి చిత్రాలే దీనికి నిదర్శనం. సిల్వర్ స్క్రీన్‌పై స్ట్రాంగ్ విలన్‌ను చూపించాలనుకున్న జక్కన్న కొత్త వారిని ప్రోత్సహించాడు. జక్కన్న పరిచయం చేసిన విలన్లు ఆ తర్వాత కెరీర్‌ను సక్సెస్ రూటులోకి మార్చేసుకున్నారు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో బలమైన విలన్ల (Strong Villain) కొరత ఏర్పడిందని జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి.
ఇటీవల సూపర్ హిట్స్ గా నిలిచిన అఖండ, పుష్ప, భీమ్లా నాయక్ చిత్రాలకు కంటెంట్ పరంగా స్ట్రాంగ్ విలన్ల అవసరం ఏర్పడింది. కానీ మేకర్స్ మాత్రం అంతగా ఎఫెక్ట్ లేని సో-కాల్డ్ విలన్లతో సినిమాలను పూర్తి చేశారు. ఈ సినిమాల్లో విలన్లకు అంత క్రేజీ లేకున్నా బాక్సాపీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టాయి. అఖండ విలన్ కానీ, భీమ్లానాయక్లో విలన్‌గా నటించిన రానా కానీ సిల్వర్ స్క్రీన్‌పై పర్ ఫెక్ట్ విలనిజాన్ని చూపించలేకపోయారన్నది వాస్తవం.
మరోవైపు పుష్పలో రావు రమేశ్ (Rao Ramesh) కానీ, సునీల్ (Sunil) కానీ మెయిన్ విలన్‌గా కనిపించాల్సి ఉండగా..ఆ పాత్ర కాస్తా ఫహద్ ఫాసిల్ (Fahadh Fassil) వైపు వెళ్లింది. భారీ బడ్జెట్ చిత్రం రాధేశ్యామ్‌లో కూడా విలన్‌గా స్పేస్ లేకుండా పోయింది. జగపతిబాబు పాత్ర పాజిటివ్ పంథాలోనే కనిపిస్తుంది. కొంతకాలంగా ఎంత పెద్ద యాక్టర్లయినా సిల్వర్‌స్క్రీన్‌పై నెగెటివ్ రోల్ లో పవర్ ఫుల్ విలన్ గా కనిపించడంలో విఫలమవుతున్నారు.
దీంతో బాక్సాపీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలు చేరుకోకుండా సినిమాలు ఫెయిల్యూర్స్ గా నిలుస్తున్నారు. కాబట్టి టాలీవుడ్ చిత్రాలు బాక్సాపీస్‌ను షేక్ చేయాలంటే..మళ్లీ మునుపటిలా స్ట్రాంగ్ విలన్ల అవసరం మాత్రం ఖచ్చితంగా ఉందంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అప్ కమింగ్ ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ విదేశీ విలన్లతో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.