బాలీవుడ్ నటుడు ముకుల్‌దేవ్(54) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ముంబయ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు. సింహాద్రి, సీతయ్య, మాస్ చిత్రాల్లో విలన్‌గా నటించిన రాహుల్ దేవ్ సోదరుడే ఈ ముకుల్‌దేవ్. సీరియల్ నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన ముకుల్‌దేవ్ బుల్లితెరపై మంచి నటుడిగా పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారు.
నటుడిగా ఆయన తొలి సినిమా ‘దస్తక్'(1996). ఆ తర్వాత బాలీవుడ్‌తో పాటు తెలుగు, పంజాబీ, కన్నడ భాషాచిత్రాల్లోనూ నటించి బహుభాషానటుడిగా గుర్తింపు సాధించారు. తెలుగులో ముకుల్‌దేవ్ నటించిన తొలి సినిమా రవితేజ ‘కృష్ణ’. ఎన్టీఆర్ ‘అదుర్స్’తో టాలీవుడ్‌లోనూ మంచి పేరు సాధించారాయన. అలాగే బాలీవుడ్లో రామ్‌గోపాల్‌వర్మ నిర్మించిన ‘అబ్ తక్ చప్పన్’ చిత్రం ఆధారంగా తెలుగులో రూపొందిన ‘సిద్ధం’ సినిమాలో విలన్‌గా నటించారు ముకుల్‌దేవ్. సినిమా అంతగా ఆడకపోయినా అందులోని ముకుల్‌దేవ్ నటనను మాత్రం ఆడియన్స్ ప్రత్యేకంగా అభినందించారు.
ఇంకా కేడీ, మనీ మనీ మోర్ మనీ, నిప్పు తదితర తెలుగు చిత్రాల్లో ముకుల్‌దేవ్ నటించారు. ‘అంత్ ది ఎండ్’ సినిమా నటుడిగా ఆయన చివరి చిత్రం. ముకుల్‌దేవ్ మరణవార్తతో బాలీవుడ్లో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ కూడా ముకుల్‌తో తన అనుభవాలను నెమరువేసుకుంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ‘ముకుల్ మరణం బాధాకరం. నిజంగా ఆయన నిబద్ధత గల నటుడు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని సంతాపం వెలిబుచ్చారు ఎన్టీఆర్.