Mithun Chakraborty | ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) షాక్ ఇచ్చింది. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మలాడ్‌లోని ప్రాంగణంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారంటూ అధికారులు నోటీసులు పంపారు. అనుమతి లేకుండా గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మెజనైన్ ఫ్లోర్‌ను నిర్మించారని నోటీసులో బీఎంసీ పేర్కొంది. సాధారణంగా రెండు అంతస్తుల మధ్య పాక్షికంగా నిర్మించే ఫ్లోర్‌ను మెజనైన్ ఫ్లోర్గా పేర్కొంటారు.
ఇలాంటి నిర్మాణాలతో పాటు, ఇటుక గోడలు, చెక్క పలకలు, గాజు అద్దాలు, ఏసీ షీట్లతో కూడిన పైకప్పుతో 10×10 అడుగుల విస్తీర్ణంలో మూడు తాత్కాలిక నిర్మాణాలను కూడా అనుమతి లేకుండానే చేపట్టారని బీఎంసీ గుర్తించి నోటీసులు జారీ చేసింది. అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని.. లేకపోతే బీఎంసీ చట్టంలోని సెక్షన్ 475ఎ కింద చర్యలు తీసుకుంటామని బీఎంసీ తన నోటీసులో స్పష్టం చేసింది. నోటీసులపై మిథున్ చక్రవర్తి స్పందించారు. తాను ఎలాంటి అక్రమ నిర్మాణం చేపట్టలేదన్నారు. చాలా మందికి బీఎంసీ నోటీసులు ఇచ్చిందని.. వారికి సమాధానం పంపుతున్నట్లు పేర్కొన్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడికి అనేక విలాసవంతమైన బంగ్లాలు, హోటల్స్, వ్యవసాయ భూములు ఉన్నాయి. కోల్‌కతాలోని ఇంటితో పాటు, అతనికి ముంబయిలో రెండు బంగ్లాలు కూడా ఉన్నాయి.
మిథున్ బాంద్రాలో ఒక ఇల్లు ఉంది. ముంబయిలోని మడ్ ఐలాండ్‌లో 1.5 ఎకరాల భూమిలో విలాసవంతమైన బంగ్లాను నిర్మించాడు. ఆ బంగ్లా విలువ ప్రస్తుతం రూ.45 కోట్లు. ముంబయితో పాటు ఊటీలోనూ ఓ ఫామ్ హౌస్ ఉంది. మిథున్‌కు తోటపని చాలా ఇష్టం. అందుకే తన ఇంటి చుట్టూ చెట్లు, మొక్కలను నాటుతూ వాటిని సంరక్షించుకుంటున్నారు. ఆయనకు ఊటీలో లగ్జరీ హోటల్స్ ఉన్నాయి. ఆయన మోనార్క్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌కు సీఈవో. ఊటీలోని ఆయన హోటల్ మోనార్క్‌లో 59 గదులు, నాలుగు లగ్జరీ సూట్లు, ఫిట్నెస్ సెంటర్, ఇండోర్ స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటకలోని పెద్ద నగరాల్లో లగ్జరీ హోటళ్లు సైతం ఉన్నాయి.