బుధవారం 03 జూన్ 2020
Cinema - May 08, 2020 , 08:16:59

అబ్బాయిల‌ని జాగ్ర‌త్త‌గా పెంచాలంటున్న హీరో భార్య‌

అబ్బాయిల‌ని జాగ్ర‌త్త‌గా పెంచాలంటున్న హీరో భార్య‌

కొద్ది రోజులుగా దేశ‌మంతా "బాయ్స్ లాకర్ రూమ్" అనే పేరుతో ఏర్పాటైన‌ ఇన్‌స్టాగ్రామ్ గురించి తీవ్ర చ‌ర్చ జ‌రుపుతుంది. ఒక పదిహేను సంవత్సరాల మైనర్ బాలుడు  ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక గ్రూప్‌లో మైనర్ బాలికల ఫోటోలు షేర్ చేస్తూ, వారిపై అసభ్యకరమైన వ్యాఖ్యల్ని చేస్తే వ‌చ్చారు. ఈ విష‌యం తెలుసుకున్న‌ దిల్లీ పోలీసులు అత‌నిని అదుపులోకి తీసుకున్నారు.

"బాయ్స్ లాకర్ రూమ్" అనే పేరుతో ఏర్పాటైన‌ ఇన్‌స్టాగ్రామ్‌ గ్రూప్‌లో దిల్లీకి చెందిన కొంతమంది స్కూల్ పిల్లలు సభ్యులుగా ఉన్నారు. ఈ గ్రూప్‌లో ఉన్నఅబ్బాయిలు తమతో పాటు చదువుకుంటున్న మైనర్ బాలికల ఫోటోలు వారి అనుమతి లేకుండా షేర్ చేసి, వారిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు, లైంగిక దాడులు, రేప్, బాడీ షేమింగ్‌కి సంబంధించిన సంభాషణలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఘ‌ట‌న ప్ర‌తి ఒక్క‌రిని షాక్‌కి గురి చేసింది. ఇప్ప‌టికే దీనిపై బాలీవుడ్ సెల‌బ్రిటీలు స్పందించారు. సోన‌మ్ క‌పూర్, స్వ‌ర భాస్క‌ర్ ఈ విష‌యంపై స్పందిస్తూ ఢిల్లీలో నిర్భ‌య లాంటి దారుణ ఘ‌ట‌న త‌ర్వాత ఇలాంటివి పుట్టుకు రావ‌డం భ‌య‌బ్రాంతుల‌కి గురి చేస్తుంద‌ని అన్నారు.

తాజాగా షాహిద్ క‌పూర్ భార్య మీరా రాజ్‌పుత్ ..భార‌తదేశంలో ఉన్న అబ్బాయిల‌కి చిన్న వ‌య‌స్సులోనే వారి త‌ల్లిదండ్రులు మ‌హిళ‌ల ప‌ట్ల గౌర‌వంగా ఉండేలా నేర్పించాలి. త‌ద్వారా వారు మ‌హిళ‌ల‌ని ప్రతికూల దృష్టితో చూడ‌రు. లింగ స‌మాన‌త్వం, గౌర‌వం, ఎవ‌రితో ఎలా మెల‌గాలి అనే అంశాలు వారిని ఎదుటి వారిపై గౌర‌వం పెరిగేలా చేస్తాయి.  చిన్నతనంలో ఉన్న‌ప్పుడు బాలురు ఏం చేయాలి, ఏం చేయ‌కూడ‌దు అనే దానిపై త‌ల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. కాని ఏం జ‌రుగుతుంది అంటే అమ్మాయిలకు ‘జాగ్రత్త’, ‘భయం’, ‘నమ్రత’ నేర్పుతున్నార‌ని మీరా చెప్పుకొచ్చింది.


logo