Pushpa | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీకి జాతీయ అవార్డు రావడంపై మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. ఎర్ర చందనం దొంగలకు జాతీయ అవార్డులు ఇస్తారా? అంటూ మండిపడ్డారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క మాట్లాడారు. సందేశాత్మక చిత్రాలకు అవార్డులు రావడం లేదన్న మంత్రి.. పోలీసుల బట్టలు విప్పి నిలబెట్టే సినిమాలకు అవార్డులు ఇస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సినిమాలను ప్రోత్సహిస్తుందో ఆలోచించాలన్నారు. మానవ హక్కులను కాపాడే న్యాయవాది జీరో అయితే.. స్మగ్లింగ్ చేసే నటుడు హీరో ఎలా అవుతాడని ఆమె ప్రశ్నించారు. సినిమాలో స్మగ్లర్ హీరో అని.. కానీ, స్మగ్లింగ్‌ను కట్టడి చేసే పోలీస్ విలన్ ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఈ తరహా సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయంటూ ఆక్షేపించారు. రెండు మర్డర్లు చేసిన వ్యక్తిని పుష్ప-2 థియేటర్లో పట్టుకున్నారన్నారు. సందేశాత్మక చిత్రాలు తీస్తేనే ఆదరించాలంటూ ప్రజలకు సూచించారు. మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాల్సి ఉందన్నారు.
సినిమాలను తాము గౌరవిస్తామని, సినిమాలు ఓ ఎంటర్టైన్మెంట్ మాత్రమేనన్నారు. కానీ, ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారనేది ముఖ్యమని.. నటులు, నిర్మాతలు, దర్శకులు ఈ సమాజాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ఆలోచనలతో సినిమాలు తీయాలని సూచించారు. ప్రస్తుతం మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇటీవల సంధ్య థియేటర్ తొక్కిలసలాట జరిగిన విషయం తెలిసిందే. తొక్కిలసలాటకు సంబంధించిన కారణాలు, హీరో అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత హీరో అల్లు అర్జున్ మీడియా సమావేశంలో తన వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ప్రెస్‌మీట్ అనంతరం సినిమాటోగ్రఫీ మంత్రి కోమటరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్‌పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్ ఇంటిపై సైతం దాడికి పాల్పడగా.. పోలీసులు అరెస్టు చేశారు.
పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
జై భీం లాంటి సినిమాకు నేషనల్ అవార్డు రాలేదు.. అలాంటి సినిమాలకు ప్రోత్సాహకాలు లేవు
కానీ ఒక స్మగ్లర్, పోలీసును బట్టలూడదీసి నిలబెడితే నేషనల్ అవార్డు ఇచ్చారు.. ఇది దేనికి సంకేతం
ఒక స్మగ్లర్‌ను హీరో చేశారు.. పోలీసును విలన్ చేశారు -… pic.twitter.com/MRYdhfS712
— Telugu Scribe (@TeluguScribe) December 23, 2024