Super Star Krishna | సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. నానక్‌రాంగూడలోని విజయకృష్ణ నివాసానికి చేరుకున్న కేటీఆర్.. అక్కడ కృష్ణ భౌతికకాయం వద్ద పూలు ఉంచి అంజలి ఘటించారు. మహేష్ బాబు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఆరా తీశారు.
350కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణ తెలుగు సినీ ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి కేటీఆర్ అన్నారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా ఆయన తెలుగు సినీ రంగానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. తెలుగు సినిమా చరిత్రలో విభిన్న తరహా పాత్రలను పోషించడంతోపాటు, అద్భుతమైన సినిమాలను నిర్మించి తెలుగు సినిమా చరిత్రలో తనదైన స్థానాన్ని సృష్టించుకున్నారన్నారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకే కాకుండా.. ఘట్టమనేని కుటుంబ సభ్యులకు తీరని లోటన్నారు.