Saif Ali Khan | ముంబైలో ఈ నెల 16న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై తన ఇంట్లో ఓ దుండగడు కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. తెల్లవారుజామున 2 గంటలకు ఇంట్లో దాడి జరగ్గా.. అతన్ని 3.30 నిమిషాలకు లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటన జరిగిన సమయంలో సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఓ ఆటో డ్రైవర్ భజన్ సింగ్ సాయం చేశాడు. దీంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నటుడికి సాయం చేసిన ఆ ఆటో డ్రైవర్ (Auto Driver)పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయన సాయాన్ని ప్రముఖ పంజాబీ గాయకుడు మికా సింగ్ (Mika Singh) మెచ్చుకున్నారు. ఈ మేరకు అతడికి భారీ రివార్డు (Reward) ప్రకటించారు.
ఈ మేరకు మికా సింగ్ తన ఇన్‌స్టా ఖాతాలో ఆటో డ్రైవర్‌ను మెచ్చుకుంటూ పోస్ట్ పెట్టారు. అతనికి రూ.లక్ష బహుమతిని ప్రకటించారు. ‘మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్‌స్టార్‌ను కాపాడినందుకు అతను కనీసం రూ.11 లక్షల రివార్డుకు అర్హుడని నేను గట్టిగా నమ్ముతున్నాను. అతని వీరోచిత చర్య నిజంగా అభినందనీయం. వీలైతే అతడి సంప్రదింపు సమాచారాన్ని నాతో పంచుకోగలరా..? నేను అతడికి రూ. లక్ష బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను’ అని మికా సింగ్ పేర్కొన్నారు.
కాగా, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌కు ముందు సైఫ్ అలీ ఖాన్ సైతం ఆటో డ్రైవర్‌ను కలిశారు. సకాలంలో తనను ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు సైఫ్ దంపతులు అతడికి కొంత నగదు కూడా రివార్డుగా ఇచ్చినట్లు తెలిసింది.
సైఫ్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో హీరోను పొడిచాడు. సుమారు ఆరు చోట్ల బలమైన కత్తిపోట్లు ఉన్నట్లు లీలావతి ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు. రెండు చోట్ల మాత్రం ఆ కత్తి పోట్లు చాలా డీప్‌గా ఉన్నాయని.. ఒక కత్తిపోటు సైఫ్ వెన్నుపూస సమీపంలో డీప్‌గా దిగినట్లు చెప్పారు. మెడ, చేయి, వెన్నులో ఓ పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు తెలిపారు. వెన్నులో దిగిన వస్తువును సర్జరీ ద్వారా తొలగించినట్లు వెల్లడించారు. ఇక ఆరు రోజుల చికిత్స అనంతరం సైఫ్ ఈనెల 21 (మంగళవారం) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Also Read..
Saif Ali Khan | ఆటో డ్రైవర్ భజన్ సింగ్‌ను కలిసిన సైఫ్ అలీ ఖాన్
Saif Ali Khan | ఆసుపత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్