‘మీరు నన్ను ఎలాంటి సినిమాలో చూడాలని కోరుకుంటున్నారో అలాంటి కథ ఇది. 1897-1922 మధ్య నడిచే పీరియాడిక్ యాక్షన్ మూవీగా ఆకట్టుకుంటుంది’ అన్నారు హీరో మంచు మనోజ్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. హనుమ రెడ్డి యక్కంటి దర్శకుడు. వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మాతలు. బ్రిటీష్‌కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌తో యాక్షన్ డ్రామాగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. బుధవారం గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ..దేన్నైనా కొట్టి తెచ్చుకోవాలనే మనస్తత్వం కలిగిన వ్యక్తి డేవిడ్ రెడ్డి అని, ఇండియాకు స్వాతంత్య్రం అడిగి కాదు కొట్టి తెచ్చుకోవాలన్నదే అతని సిద్ధాంతమని, అలాంటి పవర్ఫుల్ పాత్రను చేయడం ఛాలెంజింగ్ అనిపించిందన్నారు.
హింసకు హింసతోనే సమాధానం చెప్పే యోధుడిగా అతని పాత్ర ఉంటుందని, చరిత్రలో బయటకు రాని దారుణాలను చూపించే చిత్రమిదని మంచు మనోజ్ వివరించారు. యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని, నిజమైన పాన్ ఇండియా చిత్రమిదని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, రచన-దర్శకత్వం: హనుమ రెడ్డి యక్కంటి.