దిగ్దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమా అంటేనే ప్రత్యేకతల సమాహారం. ముఖ్యంగా ‘మగధీర’ నుంచి సినిమాపై ఆయన దృక్కోణం మారింది. కథలో ఏదో ఒక ప్రత్యేకత లేకుండా సినిమా చేయడంలేదాయన. ప్రస్తుతం మహేశ్ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో ‘వారణాసి’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.
ప్రియాంక చోప్రా కథానాయికగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ, కార్తికేయ కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాల గురించి నిర్మాతల్లో ఒకరైన కార్తికేయ మాట్లాడారు.
‘కాశీ ఘాట్స్‌లో మొదలై, అక్కడే ముగిసే కథ ‘వారణాసి’. ఈ సినిమా ఆద్యంతం విశేషాలే. సామాన్య ప్రేక్షకుడ్ని అబ్బురపరిచే ఎలిమెంట్స్ ఇందులో చాలానే ఉంటాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఉండే 20 నిమిషాల రామాయణం ఎపిసోడ్ సినిమాకే హైలెట్. స్టన్నింగ్ విజువల్స్‌తో రాజమౌళి ఈ ఎపిసోడ్‌ని రూపొందించారు.
ఈ ఎపిసోడ్ చిత్రీకరణకు దాదాపు 60రోజుల సమయం పట్టింది. దీన్ని బట్టి ఎంత జాగ్రత్తగా ఈ సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కించారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం షూట్ హైదరాబాద్‌లో జరుగుతున్నది. భారతీయ సినిమా ఎరుగని లొకేషన్స్, చూడని సిట్యువేషన్లు ఈ సినిమాలో ఉంటాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా విడుదల కానున్నది’ అని కార్తికేయ తెలిపారు.