Shilpa Shetty | బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty), ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా (Raj Kundra) దంపతులకు మరోషాక్ తగిలింది. రూ.60 కోట్ల మోసం కేసు (Rs 60 Crore Fraud Case)లో ఈ స్టార్ కపుల్స్పై లుకౌట్ నోటీసులు (Lookout Notice) జారీ అయ్యాయి. పెట్టుబడి పేరుతో భారీ మొత్తంలో మోసం చేశారని శిల్పా శెట్టి దంపతులపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారి, లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కొఠారీ (Deepak Kothari) చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
2015 నుంచి 2023 మధ్య కాలంలో వ్యాపార విస్తరణ పేరుతో శిల్పా దంపతులు తమ వద్ద రూ. 60.4 కోట్లు తీసుకున్నారని, కానీ ఆ డబ్బును తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించారని దీపక్ కొఠారీ ఈ ఏడాది ఆగస్టులో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాజేశ్ ఆర్య అనే వ్యక్తి ద్వారా తాను శిల్పా-రాజ్ దంపతులను కలిసినట్లు పిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో వారు ‘బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే హోమ్ షాపింగ్ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నట్లు తెలిపారు.
దాదాపు 87.6% వాటా వారిదేనని చెప్పారు. మొదట వీరు 12% వడ్డీతో రూ. 75 కోట్ల రుణం కావాలని అడిగారు. కానీ ఆ మొత్తం పన్నుల భారం లేకుండా పెట్టుబడిగా మారుస్తే మంచిదని ఒప్పించారని ఆయన వివరించారు. ఈ క్రమంలో కొఠారీ, 2015లో రెండు విడతల్లో రూ. 31.9 కోట్లు, రూ. 28.53 కోట్లు బదిలీ చేశారు. 2016లో శిల్పా శెట్టి వ్యక్తిగత గ్యారెంటీ ఇచ్చినా, అదే ఏడాది ఆమె డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం, 2017లో మరో ఒప్పందం విఫలమవడంతో కంపెనీ దివాళా ప్రక్రియలోకి వెళ్లినట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు.
దీపక్ కొఠారీ ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ప్రాథమిక విచారణ నిర్వహించి, మోసం, నమ్మకద్రోహం తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మోసం మొత్తం రూ. 10 కోట్లకు పైగా ఉండటంతో, కేసును జుహు పోలీస్ స్టేషన్ నుంచి ఆర్థిక నేరాల విభాగానికి (EOW) బదిలీ చేశారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది. కేసు విచారణ సమయంలో దేశం విడిచిపోకుండా ఉండేందుకు శిల్పా దంపతులపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేసినట్లు ఆర్థిక నేరాల విభాగ (Economic Offences Wing ) వర్గాలు తెలిపాయి. ఈ జంట ట్రావెల్ లాగ్లను కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read..
Allu arjun | మలయాళీలకు ఓనం పండుగ శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్
Onam Celebrations | కేరళలో ఓనం వేడుకలు.. సెలబ్రిటీల ఫొటోలు చూశారా.!
Bala Krishna | బాలయ్య లీక్స్.. అఖండ 2 రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పేశాడుగా..!