Kumary Aunty | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సంబరాలు ఘనంగా ముగిశాయి. గణేశుడి నిమజ్జనోత్సవాల్లో విశేషంగా ఆకర్షించే ఘట్టం లడ్డూ వేలం. వేలం ఎంతయినా సరే, ఆ గణపయ్య లడ్డూను దక్కించుకోవాలన్న కోరిక చాలామందిలో ఉంటుంది. ఇక ఈసారి ఈ లడ్డూ వేలంలో సోషల్ మీడియా సంచలనం, ఫేమస్ ఇంటర్నెట్ సెలబ్రిటీ కుమారీ ఆంటీ కూడా పాల్గొని అందరిని ఆశ్చర్యపరిచింది. మా నగర్ వినాయక నిమజ్జనోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంలో కుమారీ ఆంటీ పోటీపడి గణేశుడి లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇది నాకు చాలా స్పెషల్ అని ఉద్వేగభరితంగా వ్యాఖ్యానిస్తూ ఆమె ఆనందాన్ని వ్యక్తపరిచారు.
నేను హోటల్ ప్రారంభించి 15 సంవత్సరాలవుతోంది. అప్పటి నుంచీ ప్రతి వినాయక చవితికి స్వామివారికి ప్రసాదం సమర్పిస్తూనే ఉన్నాను. అదే సమయంలో గణపయ్యా.. నీ లడ్డూ నాకు ఎప్పుడిస్తావు అని అడుగుతూనే ఉన్నాను. చివరకు ఈ ఏడాది ఆ కోరిక నెరవేరింది. గణేశుడు నాకు ఆశీర్వాదంగా ఈ లడ్డూను ఇచ్చాడు. జై గణేశా, జై జై గణేశా,” అంటూ పేర్కొన్నారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్లో వైరల్గా మారింది. అనేక మంది ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ, “ఇది నిజంగా ప్రత్యేకమైన క్షణం” అని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ లడ్డూను ఆమె ఎంత మొత్తానికి దక్కించుకున్నారన్న విషయాన్ని మాత్రం ఆమె వీడియోలో వెల్లడించలేదు.
హైదరాబాద్లో సొంతంగా హోటల్ నిర్వహిస్తున్న కుమారీ ఆంటీ, తన వినూత్న రుచులతో పాటు అందరిని ఆకట్టుకునే మాట్లాడే విధానం, వినోదాత్మక షార్ట్ వీడియోలతో సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ సాధించారు. సెలబ్రిటీలు సైతం ఆమె హోటల్ దగ్గరకు వెళ్లి తమ మూవీ ప్రమోషన్స్ చేసుకున్నారంటే కుమారీ ఆంటీ క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఈ మధ్య కుమారీ ఆంటీ బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టనుందని ప్రచారాలు జరిగాయి. కాని అవి పుకార్లుగానే మిగిలిపోయాయి.