SatyaReddy | ప్రపంచ శాంతి సందేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటాలనే లక్ష్యంతో రూపొందుతున్న హాలీవుడ్ చిత్రం ‘కింగ్ బుద్ధ’ పోస్టర్ లాంచ్ కార్యక్రమం అమెరికాలోని టెక్సాస్, కెడర్ పార్క్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. టాలీవుడ్‌కు చెందిన దర్శకుడు సత్యా రెడ్డి ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌తో నేరుగా హాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం విశేషం. మూడుసార్లు కెడర్ పార్క్ మేయర్‌గా పనిచేసిన మ్యాట్ పోవెల్ ముఖ్య అతిథిగా హాజరై, ‘కింగ్ బుద్ధ’ పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మ్యాట్ పోవెల్, గౌతమ బుద్ధుని గొప్పతనాన్ని గుర్తుచేస్తూ, తెలుగు సంతతికి చెందిన సత్యారెడ్డి సినిమాను డబ్ చేయకుండా, డైరెక్ట్‌గా హాలీవుడ్లో నిర్మించడం చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. అంతేకాక, చిత్ర నిర్మాణానికి అవసరమైతే తమ బంగ్లాలు, ఇతర ప్రాపర్టీలను కూడా షూటింగ్ కోసం వాడుకోవచ్చని ఆయన తమ సహకారాన్ని ప్రకటించారు.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన శైలర్ మాట్లాడుతూ.. ప్రపంచ శాంతి కోసం రూపొందుతున్న ఈ సినిమాకు అన్లిమిటెడ్ బడ్జెట్‌తో, ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తామని తెలిపారు. సత్యా రెడ్డి గతంలో డైరెక్ట్ చేసిన ‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమాలో గద్దర్ గారి శాంతి ప్రవచనాలు చూసి ప్రభావితమై, ఆయన డైరెక్షన్లోనే అంతర్జాతీయ స్థాయిలో ‘కింగ్ బుద్ధ’ సినిమా తీయాలని నిర్ణయించుకున్నామని శైలర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా దర్శకుడు సత్యా రెడ్డి మాట్లాడుతూ, నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా, గాయకుడిగా తనకు 30 ఏళ్ల అనుభవం ఉందని, తాను చెప్పిన ‘కింగ్ బుద్ధ’ కాన్సెప్ట్‌కు నిర్మాతలు భారీ బడ్జెట్‌తో హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులతో సినిమా తీయడానికి వెంటనే అంగీకరించి, పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్టర్ లాంచ్‌కు అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులు, మిత్రులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అతి త్వరలో ఇండియాలోని ఒక ప్రముఖ బౌద్ధారామంలో ప్రపంచంలోని ప్రముఖ బౌద్ధమత పెద్దలు, గురువులు, ప్రొఫెసర్ల సమక్షంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తామని సత్యారెడ్డి ప్రకటించారు. ‘సర్దార్ చిన్నపరెడ్డి’, ‘ఉక్కు సత్యాగ్రహం’, ‘గ్లామర్’ వంటి శతదినోత్సవ చిత్రాలను నిర్మించి, ఫిల్మ్ చాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్‌గా కూడా పనిచేసిన సత్యారెడ్డి.. తొలిసారి హాలీవుడ్లో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వడంపై ఈవెంట్‌కు హాజరైన అభిమానులు, ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుల్లారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రవికుమార్ రెడ్డి, ప్రవర్ధన్, సాయి గణేష్ రెడ్డి, శివ జోష్నా రెడ్డి వంటి ప్రముఖులు పాల్గొన్నారు.