హైదరాబాద్: ఎగువన భారీ వర్షాలతో హైదరాబాద్‌లోని (Hyderabad) జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్ (Osman Sagar), హిమాయత్ సాగర్లకు (Himayat Sagar) వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో జలమండలి అధికారులు ఉస్మాన్‌సాగర్ ఆరు గేట్లను 4 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం చెరువులోకి 2 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, 2652 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులకు గాను 1789 అడుగుల వద్ద నీరు ఉన్నది. నీటి నిల్వ సామర్థ్యం 3.90 టీఎంసీలు. ప్రస్తుతం 3.71 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
మరోవైపు హిమాయత్‌సాగర్‌కు కూడా వరద కొనసాగుతుండటంతో అధికారులు రెండు గేట్లను 3 అడుగుల మేర ఎత్తివేశారు. చెరువులోకి 900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 1981 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు. ప్రస్తుతం 1762.75 అడుగులు. గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 2.970 టీఎంసీలు కాగా, ఇప్పుడు 7.744 టీఎంసీలు ఉన్నాయి. జంట జలాశాయల నుంచి నీటిని విడుదల చేయడంతో మూసీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.