Nayanthara| సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకి ధీటుగా నిలిచే హీరోయిన్ ఎవరంటే మనందరికి ఠక్కున నయనతార పేరు గుర్తొస్తుంది. లేడీ సూపర్ స్టార్‌గా ఆమెకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ వరుస అవకాశాలతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘మన శంకరవరప్రసాద్ గారు’, తమిళంలో ‘అమ్మాన్ 2’ వంటి ప్రాజెక్టులతో తెరపై సందడి చేయబోతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. ఇందులో నయనతార ‘శశిరేఖ’ అనే పాత్రలో నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో నయన్ పాత్ర ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్. దీని కోసం ఆమె ఏకంగా రూ.5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దసరా సందర్భంగా నయన్ లుక్‌ను రిలీజ్ చేసిన మేకర్స్, ఇటీవల కేరళలో షెడ్యూల్ పూర్తి చేసి, ప్రస్తుతం హైదరాబాద్‌లో సాంగ్ షూట్స్ జరుపుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే, నయనతార తమిళంలో సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అమ్మాన్ 2’ సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె మళ్లీ అమ్మవారి పాత్రలో దర్శనమివ్వనుంది. మీనా, రెజీనా, యోగి బాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై డాక్టర్ ఐష్వర్య గణేష్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో నయనతారకు రూ.3 కోట్ల రేంజ్లో పారితోషికం అందినట్లు టాక్ ఉంది. తెలుగులో రూ.5 కోట్లు, తమిళంలో రూ.3 కోట్లు – ఈ రెండు సినిమాలకే మొత్తం రూ.8 కోట్ల రెమ్యునరేషన్‌తో నయనతార దూసుకుపోతున్న విషయం ఖాయం. ఈ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న నటీమణులు చాలా తక్కువగా ఉండటంతో, నయన్ మరోసారి తన స్టార్‌డమ్‌ను మరోసారి నిరూపించుకుంటోంది.