Cough Syrups Case | మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో దగ్గు సిరప్ కారణంగా దాదాపు 14 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్యశాఖ కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించనున్నది. ఈ భేటీలో మందుల నాణ్యత విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు సీఎస్‌లు, ఆరోగ్య కార్యదర్శులు, ఔషధ నియంత్రణదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దగ్గు సిరప్ హేతుబద్ధమైన ఉపయోగం, ఔషధాల నాణ్యతపై సమావేశం నిర్వహించనున్నారు.
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) సరేషన్ ఫార్మాస్యూటికల్స్ తయారుచేసిన దగ్గు మందు కోల్డ్రిఫ్పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ ఔషధం తీసుకున్న తర్వాత చాలా మంది పిల్లలు చనిపోయినట్లు గుర్తించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ CDSCO తమిళనాడు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు లేఖ రాయనున్నది. చనిపోయిన పిల్లలలో మధ్యప్రదేశ్‌లోని చింద్వారా, రాజస్థాన్, మహారాష్ట్రకు చెందిన పిల్లలు ఉన్నారు. చిన్నారుల మృతి నేపథ్యంలో కేరళ, తెలంగాణ సైతం ఈ సిరప్ వాడకాన్ని ఆపేయాలని హెచ్చరించింది. కోల్డ్రిఫ్ సిరప్ తయారీ కంపెనీపై తీవ్రమైన నేరాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) తమిళనాడు ఎFDA (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్)ను కోరనున్నది.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఫ్యాక్టరీలపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) దర్యాప్తు ప్రారంభించింది. ఈ సందర్భంలో సీడీఎస్‌సీవో దగ్గు సిరప్లు, యాంటీబయాటిక్స్, జ్వరం మందులు సహా 19 ఔషధాల నమూనాలను సేకరించింది. మధ్యప్రదేశ్‌లోని నెక్స్ట్రో డీఎస్ అనే మరో కంపెనీ నుంచి కాఫ్ సిరప్ నమూనాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నది. సిరప్లు, యాంటీబయాటిక్స్, జ్వరం మందులు, ఒండాన్సెట్రాన్తో సహా మొత్తం 19 నమూనాలను సేకరించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం వెంటనే కోల్ట్రిఫ్, నెక్స్ట్రో డీఎస్ సిరప్‌ల అమ్మకాలను నిషేధించింది. అదే కంపెనీ ఇతర ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ నిషేధాన్ని ప్రకటించారు.
రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు దగ్గు సిరప్ ఇవ్వవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు, దగ్గు సిరప్‌ను వైద్యుల సలహా మేరకు, పరిమిత పరిమాణంలో, జాగ్రత్తగా మాత్రమే వాడాలని చెప్పింది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సైతం కోల్డ్రిఫ్ సిరప్ వాడకాన్ని నిషేధించింది. డైథిలిన్ గ్లైకాల్ (DEG) అనే విషపూరిత రసాయనం ఇందులో గుర్తించామని.. కిడ్నీలకు తీవ్రమైన హాని కలిగిస్తుందని.. ప్రాణాంతకం కావచ్చని పేర్కొంది. ప్రజలు ఈ సిరప్‌ను వాడకాన్ని నిలిపివేయాలని కోరింది.