SPB | దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గౌరవార్థం తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని ఓ రోడ్డుకు ఎస్పీబీ పేరును పెట్టింది. బాల సుబ్రహ్మణ్యం నుంగంబాక్కం ఏరియాలో నివాసం ఉండేవారు. నుంగంబాక్కంలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు స్టాలిన్ ప్రభుత్వం ఎస్పీబీ పేరు పెట్టింది. ఇకపై కాందార్నగర్ మెయిన్ రోడ్డును ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్గా పిలువనున్నారు. ఈ మేరకు సీఎం స్టాలిన్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
ఎస్పీబీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, మారాఠీ తదితర భాషల్లో దాదాపు 40వేలకుపైగా గీతాలను ఆలప్పించారు. ఆయన పేరిట గిన్నిస్ రికార్డు సైతం ఉన్నది. సినీ సంగీతరంగానికి ఆయన చేసిన సేవలకు గాను కేంద్రం 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్, 2021లో పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. బాలసుబ్రహ్మణం కరోనా బారినపడి కోలుకుంటూ 2020, సెప్టెంబర్ 25న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన నాలుగో వర్ధంతి రోజున ఆయన గౌరవార్థం స్టాలిన్ ప్రభుత్వం ఓ రోడ్డుకు ఆయన పేరును పెట్టింది. ఈ సందర్భంగా ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.