Keerthy Suresh | కీర్తి సురేష్ పేరు వినగానే దక్షిణాది ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ఆమె నటన, ఎంపిక చేసుకునే కథలు. మలయాళీ అయినప్పటికీ, కథానాయికగా ఆమె సినీ ప్రయాణం మాత్రం తెలుగు చిత్రసీమలోనే ప్రారంభమైంది. రామ్ పోతినేని సరసన నటించిన ‘నేను శైలజ’తో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిన కీర్తి, ఆ సినిమాతోనే హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ‘మహానటి’లో సావిత్రి పాత్రతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడమే కాకుండా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది.తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన కీర్తి, కొంతకాలం క్రితం బాలీవుడ్లో అడుగుపెట్టింది. అయితే ఆమె హిందీ డెబ్యూ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు.
విజయ్ హీరోగా నటించిన ‘తేరి’ సినిమాను హిందీలో ‘బేబీ జాన్’గా రీమేక్ చేయగా, అందులో సమంత పాత్రను కీర్తి సురేష్ పోషించింది. కానీ ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో హిందీ సినీ పరిశ్రమలో ఆమె తొలి ప్రయత్నం నిరాశనే మిగిల్చింది. అయితే, ఒక్క ఫ్లాప్‌తో అవకాశాలు ఆగిపోలేదు. ‘బేబీ జాన్’ విడుదల సమయంలో, పెళ్లి అయిన కొద్ది రోజులకే కీర్తి సురేష్ ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం బాలీవుడ్ నిర్మాతలు, దర్శకుల దృష్టిని ఆకర్షించింది. ప్రొఫెషనలిజం, కమిట్మెంట్ ఉన్న నటి అనే పేరు ఆమెకు రావడంతో మరోసారి అవకాశం ఇవ్వాలనే ఆలోచన బలపడినట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, టైగర్ ష్రాఫ్ హీరోగా రూపొందుతున్న ఓ యాక్షన్ ఎంటర్టైనర్లో కీర్తి సురేష్ హీరోయిన్గా ఎంపికైనట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో ‘తుపాకీ’ ఫేమ్ విద్యుత్ జమ్వాల్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందే ఈ సినిమాతో కీర్తి హిందీలో తన స్థానం మరింత బలపర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించిన తర్వాత కీర్తి కొంతకాలం సినిమాలకు విరామం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతోంది. తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ‘రౌడీ జనార్ధన’ చిత్రంలో నటిస్తుండగా, తమిళం, మలయాళంలో కూడా కొత్త సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. అంతేకాదు, ఈ ఏడాది హిందీ వెబ్ సిరీస్ ‘అక్క’లో కూడా ఆమె కనిపించనుంది.