Karishma Sharma | బాలీవుడ్ గ్లామర్ నటి కరిష్మా శర్మ ప్రమాదవశాత్తూ ఆసుపత్రి పాలయ్యారు. ముంబైలో ఓ సినిమా షూటింగ్ స్పాట్‌కి వెళ్తుండగా కదులుతున్న రైలు నుంచి దూకడంతో ఆమె గాయపడ్డారు. ఈ ఘటనపై ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వివరణ ఇచ్చిన తర్వాత ఈ విషయం హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం కరిష్మా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు. కరిష్మా శర్మ ఈ ఘటన గురించి తన ఇన్‌స్టాలో ఇలా రాసుకొచ్చింది. నిన్న షూటింగ్‌కి చీర కట్టుకుని వెళ్లాల్సి వచ్చింది. ముంబైలో లోకల్ ట్రైన్ ఎక్కాను. నా స్నేహితులు రైలును మిస్ అయ్యారు. వాళ్లు ఎక్కలేకపోయారన్న భయంతోనే కదులుతున్న రైలు నుంచి దూకేశాను. అయితే నేను వెనక్కి పడిపోవడంతో నా తలకు, వీపుకు గాయాలయ్యాయి.
డాక్టర్లు ప్రాథమిక పరీక్షల అనంతరం ఆమెకు చిన్న చిన్న గాయాలే ఉన్నాయని, అయితే తల భాగంలో గాయం కారణంగా ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం కరిష్మా ఒక రోజు పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.ఈ ఘటనపై స్పందించిన కరిష్మా ..నేను బాగానే ఉన్నాను. త్వరగా కోలుకుంటాను. మీ అందరి ప్రేమ, అభిమానం నాకు చాలా బలాన్నిస్తుంది అని పేర్కొన్నారు.
2015లో ‘ప్యార్ కా పంచనామా 2’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కరిష్మా, తరువాత ‘రాగిని ఎంఎంఎస్: రిటర్న్స్’ వెబ్‌సిరీస్‌లో బోల్డ్ రోల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె ‘ఉజ్డా చమన’, ‘హోటల్ మిలన్’, ‘సూపర్ 30’ వంటి చిత్రాల్లో నటించి గ్లామర్, పెర్ఫార్మెన్స్ పరంగా మంచి గుర్తింపు పొందారు. ఇటీవల ఆమె మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా కూడా అభిమానుల్లో చేరువయ్యారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కరిష్మాకు భారీగా ఫాలోయింగ్ ఉంది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ప్రార్ధిస్తున్నారు.