సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ రాత్రికి రాత్రే స్టార్ అయిపోవచ్చు. మరుసటి రోజే పాతాళానికి పడిపోవచ్చు. ఈ ఎత్తుపల్లాలను తట్టుకుని నిలబడటం అందరికీ సాధ్యం కాదు. కానీ, బాలీవుడ్ సీనియర్ కరీనా కపూర్ ఖాన్ మాత్రం రెండు దశాబ్దాలుగా నటిగా, ఇద్దరు పిల్లల తల్లిగా, సైఫ్ అలీ ఖాన్ సతీమణిగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌ను అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తున్నది. అసలు తన సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఫెయిల్యూర్ వస్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది? అన్న విషయాలపై ఓ సందర్భంలో కరీనా ఇలా చెప్పుకొచ్చింది.. చాలా మందికి యాక్టింగ్ అనేది ఒక గోల్. కానీ కరీనాకు మాత్రం అది తన డీఎన్ఏలో ఉందట.
యాక్టింగ్ అనేది తను బాగా ప్రేమించే పని. దానికి ఎప్పుడూ ముగింపు ఉండదని ఆమె అంటున్నది. ‘నేను ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. నటనను నేను ఆస్వాదిస్తాను కాబట్టి జీవితాంతం సినిమాలు చేస్తూనే ఉంటాను’ అని తన మనసులో మాట చెప్పింది కరీనా. గెలుపు వచ్చినప్పుడు గాల్లో తేలిపోవడం, ఓటమి వస్తే కుంగిపోవడం మనోళ్లకు అలవాటు. కానీ, కరీనా స్టయిల్ వేరు. సక్సెస్‌ని ఎప్పుడూ సీరియస్ గా తీసుకోకూడదని, ముఖ్యంగా నటులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించింది.
‘నేను మొదటి నుంచీ నా సక్సెస్‌ని చాలా ‘లూజ్’గా ధరిస్తాను, దాన్ని నెత్తికి ఎక్కించుకోను’ అని తన ఫిలాసఫీని బయటపెట్టింది. అంతేకాదు.. సోషల్ మీడియా లైఫ్ పైనా తనకున్న నిశ్చితమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘ఇన్‌స్టాలో ఎంత యాక్టివ్‌గా ఉన్నాం.. ఎలా కనిపిస్తున్నాం.. రెస్పాన్స్ ఎలా ఉంది అనేది నేనెప్పుడూ ఆలోచించలేదు. మనం ఎలా నటిస్తున్నాం, మన ఫ్యాన్స్ మనల్ని ఎంత ప్రేమిస్తున్నారు!! అన్నదే నాకు ముఖ్యం’ అని చెబుతున్నది. కరీనా చెప్పిన ఈ విషయాలు కేవలం నటులకే కాదు, ప్రతి ప్రొఫెషనల్కీ వర్తిస్తాయి. పనిని చిత్తశుద్ధితో చేసినప్పుడు వచ్చే సంతోషమే వేరు. గెలుపోటములు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ వాటిని మనం ఎలా హ్యాండిల్ చేశాం, ఫెయిల్యూర్ తర్వాత ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యాం అన్నదే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది.