కన్నడ కథానాయకుడు సంచారివిజయ్(38)సోమవారం కన్నుమూశారు. గత శనివారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన రెండు రోజులుగా బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం విజయ్ బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్లు వైద్యులు ప్రకటించారు. రంగస్థల కళాకారుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన విజయ్ కన్నడంలో ఇరవైకిపైగా సినిమాల్లో నటించారు. ‘నాన్ అవనల్ల అవన్’ చిత్రంలో ట్రాన్స్‌జెండర్ పాత్రలో అద్వితీయ అభినయాన్ని కనబరిచిన ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్నారు. కన్నడంలో రూపొందిన హరివు, కిల్లింగ్ వీరప్పన్, సిపాయి, అల్లమ, వర్తమాన, నాతిచరామి చిత్రాలతో ప్రతిభావంతుడైన నటుడిగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. విజయ్ మరణంతో కన్నడ చిత్రసీమ దిగ్భ్రాంతికి లోనైంది. విజయ్ బ్రెయిన్‌డెడ్‌కు గురవ్వడంతో ఆయన అవయవాలను కుటుంబసభ్యులు దానం చేశారు.