K .Vijaya Bhaskar | క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు విజయ్‌భాస్కర్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన నువ్వేకావాలి, మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి చిత్రాలు ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు ఫేవరేట్ చిత్రాలు. ఇప్పటికీ ఆ సినిమాలు యూట్యూబ్‌లో చూసిన, శాటిలైట్ ఛానెల్స్‌ల్లో వున్న ఆదరణ అంతా ఇంతాకాదు. అయితే ఇవన్నీ త్రివిక్రమ్, విజయభాస్కర్‌ల జోడి మ్యాజిక్లే. అయితే ఇక త్రివిక్రమ్ దర్శకుడిగా మారిపోయిన తరువాత ఈ మ్యాజిక్ మాయమైపోయింది.
త్రివిక్రమ్ దర్శకుడిగా స్టార్హీరోలతో సినిమాలు తీస్తూ బిజీగా వుంటే.. విజయభాస్కర్ మాత్రం ఆ తరువాత సక్సెస్‌పుల్ సినిమాలను తీయడంలో విఫలమయ్యాడు. అంతేకాదు దాదాపు సినిమాలకు పది సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి గత సంవత్సరమే తన వారసుడు శ్రీకమల్ని హీరోగా పెట్టి జిలేబి అనే సినిమా తీశాడు. ఆ సినిమ వచ్చి పోయినా విషయం కూడా ఎవరికి తెలియదు. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి తన వారసుడిని హీరోగా పెట్టి, తాన్వీ ఆకాంక్ష అనే తెలుగమ్మాయిని హీరోయిన్గా పరిచయం చేస్తూ ప్రేమకు నా నిర్వచనం అంటూ ఉషా పరిణయం పేరుతో మరో ప్రేమకథను తెరకెక్కించాడు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నేటి సినిమాల ధోరణిపై ఆయన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఆయన మాట్లాడుతూ నేడు కుటుంబతో కలిసి చూడదగ్గ చిత్రాలు రావడం చాలా అరుదు. ఎందుకంటే ఇప్పుడొస్తున్న సినిమాల్లో హింస, రక్తపాతం ఎక్కువైంది. థియేటర్‌కు వెళ్లేసరికి హీరోలు.. గన్లు, కత్తులతో కూడిన పెద్ద పెద్ద కటౌట్లు కనిపిస్తున్నాయి. ఇక సినిమాలో హీరో చూడడానికి ఆరోగ్యంగా కూడా కనిపించడు. కానీ వందల మందిని నరుకుతుంటాడు. అది ఆ సినిమాలు తీసిన వారికే తెలియాలి. ఇంతకు ముందు థియేటర్స్‌లో అన్ని జానర్ సినిమాలు వుండేవి. ప్రేక్షకులకు ఏ సినిమాకు వెళ్లాలో ఛాయిస్ వుండేది. ఇప్పుడు అన్ని ఒకే తరహా సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకులకు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలు రావడం లేదు. ఈ విధానంలో మార్పు రావాలి. కుటుంబ సినిమాలు పెరగాలి అని చెప్పుకొచ్చారు.
Also Read..