Mohan Babu | జర్నలిస్ట్‌పై దాడి కేసులో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు (Mohan Babu)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన కోర్టు.. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జర్నలిస్టుపై దాడి ఘటనలో మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు గత నెల 23న కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
మోహన్ బాబు తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కొడుకుతో గొడవల సందర్భంగా ఈ ఘటన జరిగిందని.. ఈ దాడికి బహిరంగంగా సదరు జర్నలిస్టుకు క్షమాపణలు కూడా చెప్పారని వెల్లడించారు. జర్నలిస్టులు బలవంతంగా ఇంట్లోకి వచ్చారని, కావాలని దాడి చేయలేదని కోర్టుకు తెలియజేశారు. మోహన్ బాబు నష్టపరిహారం చెల్లించేందుకు సిద్దంగా ఉన్నారని కోర్టుకు నివేదించారు. అయితే ఇంట్లోకి వచ్చినంత మాత్రాన జర్నలిస్టుపై దాడి చేస్తారా..? అంటూ మోహన్ బాబును కోర్టు ప్రశ్నించింది.
మరోవైపు జర్నలిస్ట్ తరపు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు. దాడి వల్ల ఐదు రోజులు ఆస్పత్రిలో ఉన్నారని..సర్జరీ జరుగడంతో నెల రోజులపాటు పైపు ద్వారానే ఆహారాన్ని తీసుకున్నట్టు కోర్టుకు తెలిపారు. జర్నలిస్టుపై దాడి చేయడమే కాకుండా కించపరిచారన్నారు. అతనికి కెరియర్ పరంగా కూడా నష్టం జరిగిందని చెప్పారు. అయితే కోర్టు ఈ ఘటనలో నష్టపరిహారం కావాలా..? జైలుకు పంపాలా అని జర్నలిస్ట్ తరపు న్యాయవాదులను అడిగింది. ప్రతివాదులు దాఖలు చేసే కౌంటర్లో అన్ని విషయాలు స్పష్టం చేయాలని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణలో తీర్పును వెల్లడిస్తామని పేర్కొంది.
మోహన్ బాబు క్షమాపణలు..
జల్పల్లిలోని నివాసం వద్ద మీడియా ప్రతినిధిపై దాడి చేయడంపై పహాడీషరీఫ్ పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.ఈ ఘటనలో మొదట ఆయనపై బీఎన్ఎస్ 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత 109 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేసి.. హత్యాయత్నం కేసుగా మార్చారు.
ఈ దాడి ఘటనలో గాయపడ్డ జర్నలిస్ట్‌కు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఓ లేఖ కూడా విడుదల చేశారు. ఈ ఘటనలో ఓ జర్నలిస్ట్ సోదరుడు గాయపడటం నాకు బాధ కలిగించింది. ఈ ఘటన తర్వాత అనారోగ్యం కారణంగా 48 గంటల పాటు ఆసుపత్రిలో చేరడంతో వెంటనే స్పందించలేకపోయా. ఆ రోజు నా ఇంటిగేటు విగిరిపోయింది.. దాదాపు 30 నుంచి 50 మంది వ్యక్తులు ఇంట్లోకి చొచ్చుకొచ్చారని.. ఆ సమయంలో సహనాన్ని కోల్పోయినట్లు లేఖలో వివరించారు.
పరిస్థితి అదుపు చేసే క్రమంలో జర్నలిస్ట్‌కు గాయమైందని.. ఇది చాలా దురదృష్టకరమన్నారు. అతడికి, ఆయన కుటుంబానికి కలిగిన బాధకు తాను తీవ్రంగా చింతిస్తున్నట్లు చెప్పారు. గాయపడ్డ జర్నలిస్ట్ త్వరగా కోలుకోవాలని మోహన్‌బాబు కాంక్షించారు.
Ramya | ఆ సన్నివేశాలు తొలగించండి.. కోర్టును ఆశ్రయించిన నటి రమ్య