అమ్మానాన్న లేని ఓ పేద బిడ్డని క్రైస్తవ మిషనరీ చేరదీసింది. ఈ పిల్లగాడే బతకడానికి వైన్ షాప్‌లో పని చేస్తూ, ఫొటోషాప్ నేర్చిండు. మనోడి పనికి ముచ్చటపడ్డోళ్లు హైదరాబాద్ పోతే పైకొస్తవని సలహా ఇస్తే.. బస్సెక్కి భాగ్యనగరి చేరిండు. వీడియో ఎడిటర్ నుంచి సినిమా ఎడిటర్ దాక ఎదిగిండు! ‘ద ఫీల్’ మూవీ కోసం మెగాఫోన్ పట్టి, ‘మాతృ’ సినిమాతో డైరెక్టర్‌గా నిలదొక్కుకున్నడు జక్కి జాన్. వెండితెరపై మెరిసిన
తెలంగాణ ఆణిముత్యం జాన్ తన జీవితంలోని ఎత్తుపల్లాలను ‘జిందగీ’తో పంచుకున్నాడు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే..
అయిదుగురు అక్కలకు నేనొక్కడినే తమ్ముడిని. నాకు మూడేళ్లప్పుడు అమ్మ చనిపోయింది. నాన్న సుతారి పనిచేసేది. ఇంకో రెండేండ్లకు నాన్న కూడా కాలం చేసిండు. మూడో అక్క నన్ను, ఇద్దరు అక్కల్ని కూలి చేసుకుంట సాకింది. మా బావ ఆళ్ల ముగ్గురిని వదిలేసి రమ్మంటే.. ‘చిన్నపిల్లలు. నేనే వీళ్లను చూసుకోవాలె’ అని మాతోనే ఉన్నది. అట్ల అక్క మా కోసం తండ్లాడింది. మమ్మల్ని చదివించాలనుకుంది. బడికి తీస్కపోతే.. ‘బీదవాళ్లు, తల్లిదండ్రులు లేరు కదా. మేం చదివిస్తం’ అని క్రైస్తవ మిషనరీ వాళ్లు అన్నరు. ‘మేము చదువుకోలేదు. మా తమ్ముడన్నా సదువుకుంటే బాగుపడతడు’ అని మా అక్క మిషనరీలో చేర్పించింది. మా ఊరు గుంపుల వల్లభాపురం (సూర్యాపేట జిల్లా) వదిలి, కట్టంగూరు దగ్గర కమ్మగూడెంలో ఉన్న మిషనరీ స్కూల్లో నాలుగో తరగతిల చేరిన. పదో తరగతి దాంక అక్కడే చదివిన.
ఎండాకాలం సెలవులల్ల వైన్‌షాపుల పనిచేసిన. అక్కడ ఒక గ్రాఫిక్స్ ఆర్టిస్ట్ పరిచయమైండు. ఆయన సలహాతో కంప్యూటర్ ఫొటోషాప్ నేర్చుకున్న. ఫొటో స్టూడియోల గ్రాఫిక్ డిజైనర్‌గ చేరిన. స్టూడియోల పనిచేస్తనే ఇంటర్, డిగ్రీ చదివిన. సూర్యాపేటల ఒకతను ‘ఫొటోషాప్ బాగా చేస్తున్నవ్. హైదరాబాద్‌ల తెలిసిన వాళ్ల షాప్ ఉంది’ అని చెప్పిండు. హైదరాబాద్ వచ్చి ఆయన చెప్పిన తాన పనిలో చేరిన. నెలకు పదిహేను వందలు, ఫుడ్, బెడ్ వాళ్లదే. ఓ కస్టమర్.. ‘తమ్ముడూ.. వీడియో ఎడిటింగ్‌కి డిమాండ్ ఉంది. అట్లనే యానిమేషన్ కూడా నేర్చుకో’ అని సలహా ఇచ్చిండు. అది నేర్చుకున్న. దిల్‌సుఖ్‌నగర్‌లో అంజలి స్టూడియోల పనిల చేరిన. అక్కడికి మల్టీ మీడియా నేర్చుకునే స్టూడెంట్స్ వచ్చేది. వాళ్లు ఎఫ్‌సీపీ నేర్చుకున్నమని చెప్పేది. అది వస్తే సినిమాల్లోకి పోవచ్చన్నరు. సినిమా మీద ఆసక్తి కలిగింది. ఎడిటింగ్ కోర్స్‌లు.. ఎఫ్‌సీపీ, ఏవీడీ నేర్చుకున్న.
అన్ని నేర్చుకొని.. కృష్ణానగర్ల అడుగుపెట్టిన. ఎవరి అండ లేదు. ఎంత తిరిగినా ఎవరూ సినిమాల్లో అవకాశం ఇయ్యలె. ఫిల్మ్నగర్ల డీజీ కోస్ట్ బసిరెడ్డి సార్‌ను కలవనీకి పోయిన. లోపలికి రానియ్యలే. ‘గల్లీ కుర్రాళ్లు’ సినిమా ఎడిటింగ్ నడుస్తున్నది. డైరెక్టర్ సాయి వెంకట్ గారితో కలిసి లోపలికి పోయిన. ఆ ల్యాబ్‌ల ఎడిటర్లు పరిచయమైనరు. ఎడిటర్ రఘు సార్‌తో కలిసి అప్పుడప్పుడూ ల్యాబ్‌కి పోయేది. అట్ల రెండు నెలలు గడిచింది. పంజాగుట్టల కొత్తగ సంధ్యా మోషన్ పిక్చర్స్ ల్యాబ్ పెట్టినరు. అక్కడ ఫ్రెషర్స్‌కి అవకాశం ఉండె. అందులో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరిన. కేబుళ్లు మార్చుడు. హార్డ్‌డిస్క్‌లు అందిచ్చుడు. రష్ కాపీ చేయటం నా పని. ఎడిటర్ రానప్పుడు మేనేజర్ ఏవీ రావు గారు చిన్న చిన్న పనులు ఇచ్చేది. పెద్ద డైరెక్టర్లు నాగిరెడ్డి, హరి, ప్రవీణ్ పూడి, ఎన్.శంకర్ సినిమాలకు అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేసిన.
‘వసంత నిలయం’ సినిమాకు ఎడిటింగ్ చేసే అవకాశం వచ్చింది. మూడు సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన. యాడ్స్, షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలకూ పని చేసిన. అప్పుడే సినిమా డైరెక్టర్ కావాలన్న కోరిక పుట్టింది! ఎవర్ని కలిసినా.. అసిస్టెంట్ డైరెక్టర్గ పనిచేయలేదని అవకాశం ఇయ్యలె. అదే టైమ్‌ల టీఆర్ఎస్ నాయకుడు కలిసి ‘కల్యాణ లక్ష్మి’ పథకం డాక్యుమెంటరీ చేద్దామన్నడు. ఆ అన్నతో కలిసి ఒక డాక్యుమెంటరీ తీసిన. అది మస్త్ పాపులర్ అయింది!
ఓ విలేజ్ స్టోరీ చెబితే నిర్మాత భాస్కరాచారికి నచ్చింది. రెండున్నర కోట్ల బడ్జెట్‌తో ‘ద ఫీల్’ మూవీ మొదలుపెట్టినం. నిర్మల్‌లో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ అయిపోయింది. అప్పట్ల నాకు ప్రొడక్షన్ మీద పట్టు లేకుండె. వాళ్లతో లైవ్‌లో వర్క్ చేయించనీకి మస్తు ఇబ్బందిపడ్డ. డబ్బు లేక చివరికి ఆ ప్రాజెక్ట్ ఆగింది. ‘సినిమా మీకు వర్కవుట్ కాదు. ఏ సపోర్ట్ లేకుండా అవకాశాలు రావు. నిలదొక్కుకోవడం కష్టం. లిప్ట్ ఇచ్చేటోళ్లుండాలె’ అనేటోళ్లు. టాలెంట్ ఉంటే అవకాశం వస్తది. ఎక్కడా ఆగొద్దనుకున్న.
డైరెక్షన్ డిపార్ట్మెంట్ల పనిచేసే నాగేందర్ సార్ సాయంతోటి ప్రొడ్యూసర్ బాబీని కలిసిన. ‘ద ఫీల్’ మూవీ రష్ చూపించిన. ఆ హీరోయిన్‌కి పెండ్లయింది. మళ్లీ షూటింగ్ కొనసాగించే చాన్స్ లేకుండ పోయింది. బాబీ సార్‌కి కొత్త స్టోరీ చెప్పిన. ఆయన ఓకే అన్నడు. స్క్రిప్ట్ రెడీ చేసిన. ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ ఓకే చేసుకున్న. ఈ సినిమా షూటింగ్లో గూడ టెక్నికల్ వాళ్లు రాజకీయాలు చేసినరు. ఈ సినిమాని పోగొట్టుకోవద్దనుకున్న. కాంప్రమైజ్ అయిన. ‘నేను అనుకున్నట్టు కావట్లేదే’ అని లోలోపల బాధపడ్డ. కరోనా టైమ్‌ల ‘గోల్మాల్ 2020’ రిలీజైంది. సినిమా సక్సెస్ కాకున్నా నేను సక్సెస్ అయిన. ఫస్ట్ టైమ్ అయినా బాగనే అటెంప్ట్ చేసిండని ఇండస్ట్రీల టాక్ వచ్చింది. ‘తమ్ముడూ.. ఒక సినిమా చేసి ఇండస్ట్రీల నిలదొక్కుకున్నవ్’ అని కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సార్ మెచ్చుకున్నడు. రవీంద్రభారతిల పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్ల నా ఫొటో పెట్టించిండు. అప్పట్నుంచి హరికృష్ణ సార్ నాకు ఏ సాయం కావాల్నంటే, అది చేసిండు.
‘గోల్మాల్ 2020’ అయిపోయినంక సైలెంట్‌గ ఉన్న. సినిమా సక్సెస్ కావాల్నంటె ఏం చేయాల్నని రాత్రీ పగలు ఆలోచించిన. సక్సెస్‌కి కంటెంటే ఇంపార్టెంట్ కాబట్టి కథల మీద ఫోకస్ చేసిన. ఆడియన్స్‌కి ఏ కథ బాగుంటుందని తెలుసుకోవడం మొదలుపెట్టిన. సైంటిఫిక్ థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామా సబ్జెక్ట్‌తో ‘మాతృ’ సినిమా ప్రాజెక్ట్ చేపట్టిన. ఈ సినిమాకు బజ్ క్రియేట్ అయింది. హిట్ టాక్ వచ్చింది. ఈ సినిమా కోసం పెద్ద ఆర్టిస్టుల్ని డీల్ చేసిన. మంచి ఔట్పుట్ వచ్చింది. సౌండ్, లిరిక్స్, సింగర్స్ పెద్దవాళ్లను పెట్టుకున్న. సీనియర్ డైరెక్టర్ ఆర్టిస్టుల్ని డీల్ చేస్తే ఎట్లాంటి ఔట్పుట్ వస్తదో? అట్ల వచ్చింది! ‘మాతృ’ సినిమా వల్ల కొత్త సబ్జెక్ట్‌తో రమ్మని కొత్త ఆఫర్లు వచ్చినయ్. ఇట్ల కిందమీద పడి, టాలెంట్‌నే నమ్ముకుని నిలబడ్డ! నా జర్నీ మొదలైంది ఇప్పుడె! ఇండస్ట్రీల మంచిపేరు తెచ్చుకోవాలి! నా కుటుంబానికి అండగా నిలవాలి!!
– నాగవర్ధన్ రాయల