కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని యావత్ సినీరంగం ఖండించింది. అమాయక పర్యాటకులను బలితీసుకోవడం హేయమైన చర్య అంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ నటీనటులు భారతీయ సినిమాల్లో నటించడానికి వీల్లేదని సోషల్‌మీడియాలో నెటిజన్లు వేలాదిగా పోస్టులు షేర్ చేస్తున్నారు. దీంతో ప్రభాస్ ‘ఫౌజీ’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న ఇమాన్వీ ఎస్మాయిల్ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ఆమె పాకిస్థాన్‌కు చెందిన మహిళ అని, వారి కుటుంబానికి పాకిస్థాన్ మిలటరీ మూలాలున్నాయని, ప్రభాస్ సినిమా నుంచి తప్పించాలని డిమాండ్స్ వస్తున్నాయి. ఈ విషయంపై ఇమాన్వీ ఎస్మాయిల్ స్పందించింది.
ఉగ్రదాడిని ఖండిస్తూ తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది. తాను పాకిస్థానీ కాదని, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరింది. ‘నా తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. నేను లాస్ఏంజెల్స్లో పుట్టాను. నేను భారత సంతతికి చెందిన అమెరికన్ అని గర్వంగా చెప్పుకుంటా. భారతీయ సంస్కృతిని నేను విశ్వసిస్తాను. అది నా రక్తంలోనే ఉంది. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు’ అని ఇమాన్వీ ఎస్మాయిల్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది. ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. డ్యాన్సర్‌గా, సోషల్‌మీడియా సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్న ఇమాన్వీ ఎస్మాయిల్ ‘ఫౌజీ’ చిత్రం ద్వారా నాయికగా అరంగేట్రం చేస్తున్నది.