‘కంగువ, ఫ్రాన్సిస్ అనే రెండు పాత్రల్లో సూర్య కనిపిస్తారు. కంగువ వెయ్యేళ్ల నాటి వీరుడు. ఫ్రాన్సిస్ మోడరన్ కేరక్టర్. రెండూ భిన్నంగా ఉంటాయి. సూర్య ఫిట్నెస్ సినిమాకు హెల్ప్ అయ్యింది. 50ఏళ్ల వయసులో ఆయన సిక్స్‌ప్యాక్ చేయడం సామాన్యమైన విషయం కాదు.’ అని దర్శకుడు శివ అన్నారు. ఆయన దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘కంగువ’. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రధారులు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై కేఈ జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శివ విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఉదయం నాలుగ్గంటలకే షూటింగ్‌కు ప్రిపేర్ అయ్యేవాళ్లం. సూర్య మేకప్‌కే రెండు గంటలు పట్టేది. శారీరకంగా, మానసికంగా సూర్య చాలా శ్రమించారు.’ అని చెప్పారు. ‘బాబీడియోల్ ఇందులో ఉధిరన్ అనే పాత్ర చేశారు. ఆయన స్క్రీన్ప్రెజన్స్ అదిరిపోతుంది. దిశా పటానీ చేసిన ఏంజెలీనా పాత్రలో భిన్న కోణాలుంటాయి. దేవిశ్రీ ‘కంగువా’కు గొప్ప సౌండ్ ఇచ్చారు. కెమెరామేన్ వెట్రీ తెరపై కొత్త ప్రపంచాన్ని చూపించారు. ఈ సినిమాను త్రీడీలోనూ చేశాం. త్రీడీ మూవీస్‌లో ‘కంగువ’ ఒక బెస్ట్ మూవీ అవుతుంది.’ అని శివ తెలిపారు.