నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన డార్క్ కామెడీ ఎంటర్టైనర్ ‘గుర్రం పాపిరెడ్డి’. మురళీ మనోహర్ దర్శకుడు. వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్(బాబీ) నిర్మాతలు. శుక్రవారం సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్‌ను శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ మనసుపెట్టి పనిచేశారని, ఈ విజయానికి కారణమదేనని, థియేటర్లన్నీ నవ్వులతో కళకళలాడుతున్నాయని నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు వారంతా కృతజ్ఞతలు తెలియజేశారు.
‘అవతార్ 3’ కారణంగా మార్నింగ్ షోస్ కాస్త స్లో అయినా.. మ్యాట్నీ నుంచి పికప్ అయి, సాయంత్రానికి థియేటర్లు 90శాతం నిండాయని, వారాంతంలో ఈ ఆదరణ మరింత పెరుగుతుందని దర్శకుడు మురళీ మనోహర్ ఆశాభావం వెలిబుచ్చారు. సినిమాకు ప్రేక్షకాదరణ లభిస్తున్నదంటూ కథానాయిక ఫరియా అబ్దుల్లా సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడు మురళీ మనోహర్ ప్యాషన్‌తో ఈ సినిమా రూపొందించారని, ఫరియా వల్లే ఈ సినిమాకు మంచి ప్రమోషన్స్ దక్కాయని, చక్కటి క్వాలిటీతో వచ్చిన చిన్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’ అని హీరో నరేష్ అగస్త్య అన్నారు. ఇంకా నటులు రాజ్‌కుమార్ కసిరెడ్డి, వంశీధర్ కోసిగి, సంగీత దర్శకుడు కృష్ణ సౌరభ్ కూడా మాట్లాడారు.