Gujarati Filmmaker Mahesh Jirawala | ప్రముఖ గుజరాతీ సినీ నిర్మాత మహేష్ జిరావాలా మిస్సింగ్ అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అతడు అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించినట్లు డీఎన్ఏ పరీక్షల ద్వారా వైద్యులు వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే.. జూన్ 12న జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. ప్రమాదం జరిగినప్పటి నుంచి మహేష్ జిరావాలా ఆచూకీ లభ్యం కాలేదు. ఆయన ఫోన్ ప్రమాద స్థలానికి 700 మీటర్ల దూరంలో చివరిసారిగా గుర్తించబడి.. ఆ తర్వాత స్విచ్ఛాఫ్ అయింది. ఆయన భార్య హేతల్ జిరావాలా తన భర్త గురించి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రమాదంలో చనిపోయిన వారిని గుర్తించడానికి అధికారులు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో మహేష్ జిరావాలా కుటుంబ సభ్యులు తమ డీఎన్ఏ నమూనాలను అందించారు. ప్రమాద స్థలంలో లభించిన శరీర భాగాలతో ఈ నమూనాలు సరిపోలడంతో ఆయన మరణం అధికారికంగా నిర్ధారించబడింది.
మొదట కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని నమ్మడానికి నిరాకరించినప్పటికీ.. పోలీసులు యాక్టివా నంబర్.. డీఎన్ఏ రిపోర్ట్‌తో సహా బలమైన ఆధారాలను సమర్పించిన తర్వాత మృతదేహాన్ని స్వీకరించారు. గుజరాతీ సినీ పరిశ్రమలో మ్యూజిక్ ఆల్బమ్‌లకు దర్శకత్వం వహించి మంచి పేరు సంపాదించిన మహేష్ జిరావాలా మరణం గుజరాతీ చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకు భార్య హేతల్, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.
Read More