హీరో రవితేజ తాజా చిత్రానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ‘ఇరుముడి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది ఆయన నటిస్తున్న 77వ చిత్రం. శివ నిర్వాణ దర్శకత్వంలో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్నది. సోమవారం రవితేజ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ ప్రకటనతో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అయ్యప్ప మాలధారణలో తలపై ఇరుముడి పెట్టుకొని మేళతాళాల సందడి నడుమ ఉత్సాహంగా కనిపిస్తున్నారు రవితేజ. తన కూతురిని ఎత్తుకొని చిరునవ్వుల్ని చిందిస్తున్న ఈ ఫొటో అందరినీ ఆకట్టుకుంటున్నది. ‘జీవితంలో సరైన సమయంలో కొన్ని కథలు మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి ఓ కథలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా.
‘ఇరుముడి’తో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నా’ అంటూ రవితేజ సినిమాపై ఆనందం వ్యక్తం చేశారు. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో ఈ కథ నడుస్తుందని, రవితేజ పాత్ర నవ్యరీతిలో ఉంటుందని మేకర్స్ తెలిపారు. బేబీ నక్షత్ర రవితేజ కూతురి పాత్రను పోషిస్తున్నది. ప్రియా భవానీ శంకర్, సాయికుమార్, అజయ్‌ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ.