Drug Racket | అంతర్జాతీయ డ్రగ్స్ దందాలో తమిళనాడుకు చెందిన సినీ నిర్మాత (Tamil film producer) ఏఆర్ జాఫర్ సాదిక్ (AR Jaffer Sadiq)ను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.2వేల కోట్ల విలువైన డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో జాఫర్‌ను అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీ (Narcotics Control Bureau) అధికారులు శనివారం వెల్లడించారు.
దేశంలో భారీ డ్రగ్స్ రాకెట్ (Drug Racket) గుట్టురట్టైన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసులు (Delhi police), ఎన్సీబీ (NCB) అధికారులు గత నెలలో సంయుక్త ఆపరేషన్ చేపట్టి అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌ను చేధించారు. ఈ కేసులో ఇప్పటికే అధికారులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 50 కిలోల సూడోఎఫెడ్రిన్‌ను (pseudoephedrine) స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాలో జాఫర్ సాదిక్ (AR Jaffer Sadiq) కీలక సూత్రధారిగా గుర్తించిన పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్సీబీ అధికారులు ఇవాళ వెల్లడించారు.
కాగా, ఈ డ్రగ్ నెట్వర్క్ భారతదేశం, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియాలకు విస్తరించినట్లు పోలీసులు తెలిపారు. హెల్త్ మిక్స్ పౌడర్, ఎండు కొబ్బరి వంటి ఆహార పదార్థాల ముసుగులో కొన్ని సరకుల ద్వారా దీనిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. గత 3 ఏళ్లలో మొత్తం 45 సరకులు పంపారని, అందులో సుమారు 3,500 కిలోల సూడోఎఫెడ్రిన్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.2000 కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు. అంతేకాదు మొత్తం నెట్‌వర్క్‌ను చేధించడానికి ఆయా దేశాల్లో ఉన్న నిందితులను కూడా అరెస్టు చేయడానికి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అధికారులను సంప్రదించినట్లు పోలీసులు (police) వెల్లడించారు.
జాఫర్‌ను పార్టీ నుంచి తొలగించిన డీఎంకే
సాదిక్ తమిళనాడు (Tamil Nadu)లోని అధికార డీఎంకే (DMK)కి చెందిన వ్యక్తి. భారీ డ్రగ్ రాకెట్లో ఆయన కీలక పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో.. డీఎంకే సాదిక్‌పై ఇటీవలే చర్యలు తీసుకుంది. క్రమశిక్షణను ఉల్లంఘించి పార్టీకి చెడ్డపేరు తెచ్చినందుకు గానూ ఆయన్ని విధుల నుంచి తొలగించింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు ఎన్ఆర్ఐ విభాగం నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ప్రకటించారు.
Also Read..
Supriya Sule | పవార్ కుటుంబంలో కీలక పరిణామం.. వదినా మరదళ్ల ఆప్యాయ ఆలింగనం.. VIDEO
Hardeep Singh Nijjar | వెలుగులోకి ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య దృశ్యాలు