పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో టర్కీ దేశం వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలొచ్చాయి. టర్కీతో పాటు అజర్బైజాన్ దేశాలు పాకిస్థాన్‌కు బాహాటంగానే మద్దతు ప్రకటించాయి. పాకిస్థాన్ సైన్యానికి టర్కీ డ్రోన్లను కూడా సరఫరా చేసింది. ఈ నేపథ్యంలో ఆ రెండు దేశాల్లో భారతీయ సినిమాల చిత్రీకరణలు జరపొద్దనే డిమాండ్స్ ఎక్కువవుతున్నాయి. తాజాగా ఈ విషయంపై వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ ఓ ప్రకటన జారీ చేసింది. జాతీయ సమగ్రత, భద్రతను దృష్టిలో పెట్టుకొని భారతీయ దర్శకనిర్మాతలు టర్కీ, అజర్బైజాన్ దేశాల్లో షూటింగ్‌లకు దూరంగా ఉండాలని కోరింది.
‘జాతి ప్రయోజనాల కోసం అందరూ ఐక్యంగా ఉండాలి. అంతర్జాతీయ వేదికలపై కూడా టర్కీ.. పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచింది. ఇది చాలా తీవ్రమైన విషయం. భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే ఇలాంటి చర్యలని అందరూ ప్రతిఘటించాలి. ఇక ఆ దేశాల్లో షూటింగ్‌లను రద్దు చేసుకోవాలి’ అని ఎంప్లాయిస్ యూనియన్ కోరింది. ఈ విషయం గురించి ఇండో-టర్కిష్ ఫిల్మ్ మేకర్ ప్రేమ్‌రాజ్ సోనీ కూడా స్పందించారు. ఇది స్వాగతించాల్సిన నిర్ణయమని, టర్కీలో షూటింగ్ పరంగా ఎలాంటి రాయితీలు లేవని, కేవలం అక్కడి ప్రకృతి అందాల కోసం షూటింగ్స్‌కు వెళ్తున్నామని ఆయన చెప్పారు.