Ram Narayan | ‘నా తొలి సినిమా ‘బట్టల రామస్వామి బయోపిక్’ 2021లో ఓటీటీ రిలీజై ప్రేక్షకాదరణ పొందింది. ఆ తర్వాత ఓ యూనిక్ కథతో రావాలనుకున్నాను. హీరో లేడీ గెటప్ వేయడం యూనిక్ కాన్సెప్ట్. క్యారెక్టరైజేషన్ సరిగ్గా కుదిరితే అద్భుతంగా వస్తుంది. అందుకే రీసెర్చ్ చేసి ఈ కథ రాశా.’ అని దర్శకుడు రామ్‌నారాయణ్ అన్నారు. విశ్వక్సేన్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లైలా’. సాహు గారపాటి నిర్మాత. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘బ్యూటీపార్లర్‌లో పనిచేసే ఓ మేల్ క్యారెక్టర్.. పరిస్థితుల ప్రభావం వల్ల ఫిమేల్గా గెటప్ మార్చుకోవాల్సొస్తే ఎలావుంటుంది? అనే ఆలోచనతో ఈ కథ రాశా. కథ నచ్చి సాహు గారపాటి తీయడానికి ముందుకొచ్చారు. ఇద్దరుముగ్గురు హీరోలకు కథ వినిపించాం. లేడీ కేరక్టర్ అనగానే వెనక్కు తగ్గారు. చివరకు సాహుగారే విశ్వక్ పేరు సూచించారు.
మాస్ హీరో విశ్వక్ ఈ తరహా పాత్ర చేస్తారా?! అనే డౌట్‌తో ఆయన్ను కలిశా. విషయం చెప్పకుండా కథ వినిపించా. ఇంటర్వెల్‌కే ఆయనకర్థమైపోయింది. ఫస్టాఫ్ అంతా సోనూగా కనిపిస్తారు. సెకండాఫ్ నుంచి ఆయన లైలాగా మారతారు. విశ్వక్‌కి ఎప్పట్నుంచో లేడీ కేరక్టర్ చేయాలనే కోరిక ఉందట. ఈ కథ చెప్పడంతో ఇమేజ్ను పక్కన పెట్టి ఓకే చేశారు.’ అని చెప్పారు. ఈ కథలో వల్గారిటీ ఉండదని, నాటీనెస్ మాత్రమే ఉంటుందని, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడదగ్గ క్లీన్ ఎంటర్టైనరని, ఇందులో కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయని ఆయన తెలిపారు. ‘రెమో’ సినిమాలో హీరో శివకార్తికేయన్ లేడీ గెటప్‌కి ప్రోస్తటిక్ చేసిన మేకప్‌మేన్ నిక్కీ.. ఈ సినిమాలో విశ్వక్‌ని లైలాగా మార్చారని, ఆ గెటప్‌లో విశ్వక్‌ని చూసి కళ్లు తిప్పుకోలేకపోయామని, ఇందులో పాత్రల్నీ కీలకమేనని, సాంకేతికంగా సినిమా రిచ్‌గా ఉంటుదని రామ్‌నారాయణ్ తెలిపారు.