‘నేను వంద చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైన్ చేశాను. 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా. అందుకే అసిస్టెంట్ డైరెక్టర్‌గా అనుభవం లేకున్నా సినిమా తీయగలననే నమ్మకం ఏర్పడింది’ అని చెప్పింది ప్రముఖ ైస్టెలిష్ట్ నీరజ కోన. ‘తెలుసు కదా’ చిత్రంతో ఆమె దర్శకురాలిగా పరిచయమవుతున్నది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా మంగళవారం డైరెక్టర్ నీరజ కోన పాత్రికేయులతో ముచ్చటించింది. తనకు పాఠశాల రోజుల నుంచే సాహిత్యం, రచన అంటే ఇష్టమని, తాను రాసిన కవితలతో ఓ పుస్తకం కూడా పబ్లిష్ అయిందని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘ ఇండస్ట్రీలో నాని వంటి ఫ్రెండ్స్ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. దాంతో సినిమాకు కథ రాయగలననే నమ్మకం కలిగింది.
ఓ సినిమా ఈవెంట్లో హీరో నితిన్‌కు ఈ కథ తాలూకు లైన్ చెప్పాను. దీనికి సిద్ధు అయితే బాగుంటుందని అన్నారు. ఆ తర్వాత సిద్ధుకి కథ చెబితే సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశారు. అలా ఈ సినిమా పట్టాలెక్కింది’ అని చెప్పింది. ‘తెలుసు కదా’ చక్కటి ప్రేమకథా చిత్రమని, మూడు పాత్రల చుట్టూ కథ నడుస్తుందని, ప్రతీ పాత్ర నిజాయితీగా ఉంటుంది కాబట్టి.. ప్రేక్షకులు కథతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారని తెలిపింది.
‘సిద్థు ఈ కథని మరోస్థాయికి తీసుకెళ్లారు. వరుణ్ అనే యువకుడి పాత్రలో మెస్మరైజ్ చేశారు. తమన్ మ్యూజిక్, పీపుల్ మీడియా నిర్మాణ విలువలు ఈ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. త్వరలో ఓ హార్డ్ హిట్టింగ్ లవ్‌స్టోరీ చేయబోతున్నా. ఆ సినిమా వివరాల్ని త్వరలో ప్రకటిస్తాం’ అని నీరజా కోన చెప్పింది.