ఇటీవలే భారతీయ చలన చిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కేను అందుకున్నారు మలయాళీ అగ్ర నటుడు మోహన్‌లాల్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘వృషభ’. నందకిషోర్ దర్శకుడు. మలయాళ సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా రూపొందుతున్న ఈ సినిమా నవంబర్ 6న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్‌తో పాటు హృదయాన్ని కట్టిపడేసే భావోద్వేగాలుంటాయని, విజువల్స్ అబ్బురపరుస్తాయని తెలిపారు.
ఈ సినిమాలో మోహన్‌లాల్ మహాపరాక్రమవంతుడైన రాజు పాత్రలో కనిపించనున్నారు. సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయనసారిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీ, నిర్మాణం: కనెక్ట్స్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్, దర్శకత్వం: నందకిషోర్.