Director Nag Ashwin | తాడూరు, ఆగస్టు 10 : తన గ్రామంలోని గుడి, బడిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ‘కల్కి’ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు. నాగ్అశ్విన్ సొంతూరైన నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఐతోల్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తన సొంత నిధులు రూ.66 లక్షలతో నూతనంగా నిర్మించిన నాలుగు అదనపు తరగతి గదులను శనివారం కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ అశ్విన్ మాట్లాడుతూ.. పుట్టిన ఊరు, కన్న తల్లిని ఎప్పటికీ మరిచిపోనన్నారు. కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ కన్నతల్లితో సమానమైన సొంతూరికి ఉన్న బంధం పేగుబంధం వంటిదన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి మాట్లాడుతూ చిన్న వయసులోనే ‘కల్కి’ సినిమాతో ప్రపంచ స్థాయికి ఎదిగిన నాగ్ అశ్విన్ మన జిల్లా వాసి కావడం గర్వించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ అశ్విన్ తల్లి జయంతిరెడ్డి, తండ్రి జయరాంరెడ్డితో పాటు పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.