‘మాస్ జాతర’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు రచయిత భాను భోగవరపు. రవితేజ కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం దర్శకుడు భాను భోగవరపు విలేకరులతో ముచ్చటించారు. ఈ సినిమాలో రవితేజ రైల్వే పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తారని, క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ కథలోని ఓ కొత్త పాయింట్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందని చెప్పారు.
‘ఇది కల్పిత కథే అయినా దీనికోసం ఎంతో పరిశోధన చేశా. కొందరు రైల్వే పోలీస్ అధికారులను కలిసి వారు చూసిన క్రైమ్ ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకున్నా. వాటి స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నా. ఇందులో మాస్ అంశాలతో పాటు పుష్కలమైన వినోదం ఉంటుంది’ అని భాను భోగవరపు తెలిపారు. ఈ చిత్రంలో శివుడు అనే ప్రతినాయకుడి పాత్రలో నవీన్‌చంద్ర కనిపిస్తారని, స్పెషల్ ఫొటోషూట్ చేసి ఆయన్ని ఈ పాత్రకోసం ఎంపిక చేశామని పేర్కొన్నారు.
‘కథానాయిక శ్రీలీల ఇందులో పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. కథలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మాస్ అంటే మొదట గుర్తొచ్చే పేరు రవితేజ. ఆయన కోసమే ఈ కథ రాశా. సినిమా టైటిల్‌ను కూడా ఆయనే పెట్టారు. విక్రమార్కుడు, క్రాక్ వంటి సినిమాల్లో రవితేజ పోలీస్ క్యారెక్టర్స్‌లో కనిపించారు. అయితే ‘మాస్ జాతర’లో ఆయన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది’ అని భాను భోగవరపు చెప్పారు.