గత కొంతకాలంగా చక్కటి విజయాలతో దూసుకుపోతున్నారు హీరో శ్రీవిష్ణు. తనదైన శైలి కామెడీతో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’. యదునాథ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని సుమంత్ నాయుడు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో గురువారం మ్యూజికల్ జర్నీకి శ్రీకారం చుట్టారు. ‘దేఖో విష్ణు విన్యాసం’ అంటూ సాగే తొలిగీతాన్ని విడుదల చేశారు.
కథానాయకుడికి జ్యోతిష్యంపై ఉండే మక్కువను చర్చిస్తూ ఈ పాట సాగింది. రధన్ స్వరానికి రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. శ్రీకృష్ణ ఆలపించారు. నయనసారిక, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీశర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రధన్, నిర్మాణ సంస్థ: శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్, రచన-దర్శకత్వం: యదునాథ్ మారుతీరావు.